ఓటమిపై మెస్సీ ఆవేదన
ఈస్ట్ రూథర్ఫర్డ్: కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ తుది పోరులో అర్జెంటీనాను విజేతగా నిలపడంలో విఫలమైన ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జెంటీనాకు కప్ సాధించి పెట్టాలని శతవిధిలా తనవంతు ప్రయత్నం చేసినా, అది సాధ్యం కాలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ ఓటమిపై విశ్లేషించే సమయం కాకపోయినా, గెలుపు సాధించడం కష్టంగా మారిందన్నాడు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్కు వీడ్కోలు చెప్పినట్లు మెస్సీ తెలిపాడు. ఇక జాతీయ జట్టుతో ఆడనందుకు బాధగా ఉన్నా ఓటమికి నైతిక బాధ్యతగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. ' జట్టును కోపా అమెరికా చాంపియన్గా నిలుపుదామని ప్రయత్నించా. అయితే అది జరగలేదు. ఓటమికి బాధ్యత నాదే. ఇక అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్లో కనిపించను. ఎంతో ముఖ్యమైన పెనాల్టీ షూటౌట్ను సాధించలేకపోయా. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదు 'అని మ్యాచ్ అనంతరం మెస్సీ పేర్కొన్నాడు.
భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన కోపా ఫైనల్ పోరులో చిలీ 4-2 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. తద్వారా వందేళ్ల సుదీర్ఘ చరిత్రలోభాగంగా నిర్వహించిన ఈ కప్ను చిలీ సగర్వంగా వరుసగా రెండోసారి అందుకుంది. 2015లో కూడా చిలీ చేతిలోనే అర్జెంటీనా ఓటమి పాలైంది. అప్పుడు కూడా పెనాల్టీ షూటౌట్లోనే చిలీ జయకేతనం ఎగురువేసింది. ఆనాటి ఫైనల్లో చిలీ 4-1 తేడాతో విజయం సాధించగా, ఈ ఏడాది పోరులో 4-2 తో గెలిచింది. ఈ రెండు సార్లు అర్జెంటీనా కెప్టెన్గా మెస్సీని ఉండటం గమనార్హం.క్లబ్ జట్టు బార్సిలోనాకు ఎన్నో ట్రోఫీలు అందించిన మెస్సీ.. అర్జెంటీనా కేవలం రెండు ప్రధాన ట్రోఫీలను సాధించడంలో మాత్రమే మెస్సీ భాగస్వామి అయ్యాడు. అండర్-20 వరల్డ్ కప్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్జెంటీనా జట్టులో మాత్రమే మెస్సీ పాలు పంచుకున్నాడు.