కోరీ అండర్సన్ ఆల్రౌండ్ షో
వెల్లింగ్టన్: పాకిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి టీ 20లో న్యూజిలాండ్ 95 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్ కు గప్టిల్(42), విలియమ్సన్(33) లు శుభారంభాన్ని అందించారు. అనంతరం మున్రో(4) అవుట్ కావడంతో న్యూజిలాండ్ 62 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో సెకెండ్ డౌన్ లో బ్యాటింగ్కు వచ్చిన కోరీ అండర్సన్ వీరవిహారం చేశాడు. అండర్సన్ (82 నాటౌట్; 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్(2),అహ్మద్ షెహజాద్(8) వెనువెంటనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు. ఆపై రిజ్వాన్(4), షోయబ్ మాలిక్(14) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో పాకిస్తాన్ 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత సర్ఫరాజ్ అహ్మద్(41) రాణించినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. పాకిస్తాన్ జట్టులో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో పాకిస్తాన్ 16.1 ఓవర్లలో 101 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. న్యూజిలాండ్ బౌలరల్లో మిల్నే, ఎలియట్ లు తలో మూడు వికెట్లు తీయగా, కోరీ అండర్సన్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన అండర్సన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.