కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటు
చైర్మన్‌గా ‘శాప్’ ఎండీ
సాక్షి, హైదరాబాద్: అవినీతి, నిబంధనల ఉల్లంఘనలతో చాలా కాలంగా వివాదాలకు చిరునామాగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణలో భాగం కావాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఎనిమిది మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మేనేజింగ్ డెరైక్టర్ చైర్మన్‌గా ఈ కమిటీని నియమిస్తూ మంగళవారం జీఓ నం. 501ను జారీ చేసింది. ఇందులో శాప్ ఎండీతో పాటు హెచ్‌సీఏ కార్యదర్శి (కన్వీనర్), జీహెచ్‌ఎంసీ కమిషనర్, సైబరాబాద్ కమిషనర్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ, ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా పని చేస్తారు.
ఉప్పల్‌లోని మ్యాచ్‌ల నిర్వహణ కోసం పైన చెప్పిన వేర్వేరు విభాగాలనుంచి ఇకపై ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా సౌకర్యాలు, ప్రేక్షకుల భద్రత, పార్కింగ్, కాంప్లిమెంటరీ పాస్‌ల పంపిణీలో పారదర్శకత తదితర అంశాల్లో సమన్వయ కమిటీ పాత్ర ఉంటుంది.
విచారణ అనంతరం...
2003-04లో స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీఏకు తక్కువ ధరకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందంలోని అనేక నిబంధనలను హెచ్‌సీఏ ఉల్లంఘించిందని వచ్చిన ఆరోపణలపై దాదాపు ఏడాది క్రితం ‘శాప్’ ఎండీ విచారణ జరిపారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇతరులతో అనేక ఒప్పందాలు చేసుకున్నారని, క్రికెటేతర కార్యక్రమాలకు స్టేడియంను ఉపయోగించి క్రీడల స్ఫూర్తిని దెబ్బ తీశారని విచారణలో అభిప్రాయ పడ్డారు.
అనంతరం సమర్పించిన నివేదికలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఎండీ సూచించారు. దీనిపై క్రీడల శాఖ ఇటీవలే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి నివేదికకు ఆమోదం పొందింది. దాంతో కమిటీ ఏర్పాటుపై జీఓ ఉత్తర్వులు వెలువడ్డాయి.
క్రికెట్‌పై ప్రభుత్వ పెత్తనం!
Published Fri, May 23 2014 12:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement