క్రికెట్.. ప్రపంచమంతా క్రేజీ ఉన్న క్రీడ. మైదానంలో ఆటగాళ్లు ఆడుతుంటే క్రీడాభిమానులు, ప్రేక్షకులకు ఒకటే ఉత్కంఠ. మన జట్టు గెలవాలని ఆరాటం. అటువంటి ఆటలో నెగ్గాలంటే ఫీల్డింగ్‌లో రాణించాలి. బ్యాటింగ్‌లో ఎంతటి నైపుణ్యం కనబరిచినా ఫీల్డింగ్‌లో విఫలమైతే పరాజయం తప్పదు. మరి అలాంటి ఫీల్డింగ్ కోచ్‌గా భారత జట్టుకు సేవలందిస్తున్నాడు మన హైదరాబాదీ. ఓ సాధారణ క్రికెటరైన అతను ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌నే శాసిస్తున్న భారత జట్టుకు ఫీల్డింగ్‌లో మెలకువలు నేర్పించే స్థాయికి ఎదిగాడు. తండ్రి ఆశయం కోసం అహరహం తపించి ఉన్నత స్థానానికి చేరాడు. అతడే రామకృష్ణన్ శ్రీధర్. శనివారం ఆయన ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ విశేషాల సమాహారమే
ఈ కథనం. – చైతన్య వంపుగాని
సికింద్రాబాద్‌లోని సిఖ్‌విలేజిలోని ఎస్సీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే రామకృష్ణ, పార్వతి దంపతుల కుమారుడు రామకృష్ణన్ శ్రీధర్. తండ్రి రామకృష్ణకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. శ్రీధర్‌ను క్రికెట్‌లో మంచి ఆటగాడిగా చూడాలనేది ఆయన స్వప్నం. 1985లో బేగంపేటలోని ‘రాజాజితేంద్ర’ స్కూల్లో శ్రీధర్ 10వ తరగతి పూర్తి చేశాడు. వెస్లీ కాలేజీలో ఇంటర్‌లో జాయిన్ అయ్యాడు. 1986లో క్రికెట్ కోచ్ సంపత్‌కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెరిగింది. ‘హైదరాబాద్ బ్లూస్’ తరఫున ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. 1989లో ఎస్‌బీహెచ్‌లో క్యాషియర్ ఉద్యోగంలో చేరాడు. ఆ బ్యాంకు తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడి ప్రతిభను కనబరిచాడు.
రంజీ ప్లేయర్‌గా గుర్తింపు
1989లో కేరళలో జరిగిన రంజీ ట్రోఫీ లీగ్‌లో శ్రీధర్ ఎస్‌బీహెచ్ తరఫున బరిలోకి దిగాడు. తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గాయాలపాలై కొన్ని రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రంజీ ప్లేయర్‌గా ఆడుతున్న సమయంలో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
అలా ఫీల్డింగ్ కోచ్‌గా..
సాదాసీదాగా వెళ్తున్న శ్రీధర్ జీవితంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2014లో ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్)లో ‘కింగ్ లెవన్ పంజాబ్’ జట్టుకు కోచ్‌గా చేసే అవకాశం వచ్చింది. ఇదే ఏడాది భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్ అరుణ్ అర్ధరాత్రి ఫోన్ చేసి.. ‘శ్రీధర్ ఇండియన్ టీంకి ఫీల్డింగ్ కోచ్‌గా చేస్తావా? అని అడిగాడు. నేను వెంటనే సరేనన్నాను. ఆ మరుసటి రోజు ఉదయం బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఇండియన్ టీంకి ఫీల్డింగ్ కోచ్‌గా చేయాలని అడిగారు. వెంటనే ఒప్పుకొన్నా’ అన్నాడు శ్రీధర్.
భుజం తట్టిన ధోని..
క్రికెట్ ప్రపంచంలో ధోని, విరాట్ కోహ్లీ ఎంతో అరుదైన ఆటగాళ్లు. వీరికి ఫీల్డింగ్ నేర్పించడమంటే కత్తిమీద సామే. ‘మొదటి రోజు ధోని వద్దకు వెళ్లి నేను కొత్త కోచ్‌ని కదా. మీకు నేను ఎలా ఉపయోగపడగలనో చెప్పండి, ఆ విధంగా ఉంటా అని చెప్పాను. ఆయన నా భుజం తట్టాడు. ఇప్పుడెలా ఉన్నావో ఇకముందు కూడా అలాగే నీ ప్రయాణం సాగించు అని ధైర్యం చెప్పాడు. ఆయన ఇచ్చిన ఆత్మస్థైర్యాన్ని నేనెప్పుడూ మరిచిపోను’
శిష్యుడు.. విహారీ
‘2003లో 20 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకువచ్చి నా చేతిలో పెట్టారు. ఆ పిల్లల్లో ప్రస్తుత ఇండియన్ ప్లేయర్ హనుమ విహారీ కూడా ఉన్నాడు. 20మందిని మంచి క్రీడాకారులుగా చేశా. ఇప్పుడు విహారీ భారత్ జట్టు తరఫున ఆడటం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నేను బ్యాట్ పట్టించిన వ్యక్తి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడం.. విహారీ నా శిష్యుడు అని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంది’ అన్నాడు శ్రీధర్.
ఫీల్డింగ్ స్టాటిటిక్స్ వచ్చుండాలి..
‘క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌కు సంబంధించిన స్టాటిటిక్స్ ఉంటాయి కానీ.. ఫీల్డింగ్‌కు సంబంధించిన స్టాటిటిక్స్ ఉండవు. నేను కోచ్‌గా ఉన్నప్పటి నుంచి ఫీల్డింగ్‌లో అనేక మార్పులు వచ్చాయి. ఫీల్డింగ్‌లో మనోళ్లు ది బెస్ట్‌గా ఉంటున్నారు. ఫీల్డింగ్‌లో స్టాటిటిక్స్ అనేవి ప్రేక్షకులు చూపిస్తే ఆటగాళ్లకు కూడా మంచి ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. కానీ.. నేను చెప్పగలను, ఏ ఆటగాడు ఎన్ని బాల్స్ ఆపాడు, ఎన్ని క్యాచ్‌లు పట్టాడు, ఎన్ని రన్ అవుట్స్ చేశాడని. వచ్చే వరల్డ్‌కప్ సమయానికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో రాణించి విజయం సాధిస్తాం’ అంటూ ముగించాడు శ్రీధర్. ‘కొన్ని మ్యాచుల్లో ఆటగాళ్లను చాలా దగ్గరగా గమనించాను. వారిలో ఉన్న లోపాలను గుర్తించాను. వాటిని పాయింట్ అవుట్ చేశా. ఇవి విజయానికి దారి తీస్తున్నాయి’.
Comments
Please login to add a commentAdd a comment