కోహ్లి.. ఆ మెరుపు ఇన్నింగ్స్‌ను గుర్తుకుతెచ్చాడు!
న్యూఢిల్లీ: ఇప్పటికీ బ్యాటింగ్ కొలమానం అంటే భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే. రిటైరైనప్పటికీ ప్రస్తుత క్రికెట్ శకంపై కూడా సచిన్ ప్రభావం ఉంది. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లి చూపిన కళాత్మక బ్యాటింగ్ చాలామందికి సచిన్ గుర్తుకు తెచ్చింది. తన అభిమాన దైవమైన సచిన్‌తో కోహ్లిని చాలామంది పోల్చారు కూడా.
ఈ మెగా టోర్నమెంట్‌లో చావో-రేవో తేల్చుకోవాల్సిన తరుణంలో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంతకుముందు పాకిస్థాన్‌పై అర్ధ సెంచరీ చేసిన కోహ్లి.. తాజాగా ఆస్ట్రేలియాపై అద్భుతమైన రీతిలో 82 పరుగులను పిండుకున్నాడు. భారత జట్టును ఒంటిచెత్తో సెమిస్‌కు చేర్చాడు. కోహ్లి ఆడిన ఈ కళాత్మక ఇన్నింగ్స్ చాలామందికి 1998నాటి షార్జా వన్డే మ్యాచ్‌ను గుర్తుకుతెచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ తుఫాన్‌లా చెలరేగి 143 పరుగులు చేశాడు. భారత జట్టుకు విజయాన్నందించాడు.
18 ఏళ్ల కిందట జరిగిన ఈ మ్యాచ్.. సచిన్ చేతిలో షేన్ వార్న్‌కు పీడకలను మిగిల్చింది. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఆసిస్ స్పిన్ దిగ్గజం.. కోహ్లి తాజా ఇన్నింగ్స్‌పై సచిన్ నీడనే ఉందంటూ ట్వీట్ చేశాడు. 'కోహ్లి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. నువ్వాడిన స్పెషల్ ఇన్నింగ్స్‌ను ఇది గుర్తుకుతెచ్చింది బడ్డీ' అంటూ సచిన్‌కు వార్న్ ట్వీట్ చేశాడు. రెండు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో తనను బెస్ట్ ఛేజర్ అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు.
లారా కూడా ఫిదా అయిపోయాడు!
విరాట్ కోహ్లి తాజా ఇన్నింగ్స్ చూసి వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా ముగ్ధుడైపోయాడు. కోహ్లి గతంలో ఆడిన మ్యాచ్‌ల వీడియోలు ఇవ్వాలంటూ ఆయన ట్వీట్ చేశాడు. తాను ఇప్పటివరకు చూసినవారిలో 'బెస్ట్ టైమర్ ఆఫ్ క్రికెట్ బాల్' కోహ్లి అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎనిమిదేళ్ల కిందట శ్రీలంకతో మ్యాచ్ ద్వారా క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు కలిపి మొత్తం 36 సెంచరీలు చేశాడు. వన్డేలు, టీ20ల్లో స్థిరమైన బ్యాటింగ్ చేస్తూ అంతర్జాతీయంగా క్రికెట్ స్టార్‌గా ఎదిగాడు.