
కరాచీ: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. ‘నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని క్రికెట్ బోర్డు, అభిమానులు, ప్రజలను కోరుకుంటున్నా. దయచేసి నన్ను మన్నించండి. బుకీ అనుభట్‌ను కలిసి చాలా పెద్ద తప్పుచేశా. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నా’ అని కనేరియా మీడియాకు తెలిపాడు.
‘ఆరేళ్ల నుంచి అబద్ధాలు చెబుతూ ఇప్పుడు నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. నాకెంతో భారంగా ఉంది. అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నా. స్ఫాట్ ఫిక్సర్ అని పిలిపించుకోలేను. ఇక ఎంత మాత్రమూ ఖండించనూ లేను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ప్రజలు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా. ఈ కేసుకు సంబంధించి నా బ్యాంకు ఖాతాను ఇప్పటికే చాలా సార్లు తనిఖీ చేశారు. అనుభట్‌కు దగ్గరవ్వడమే నేను చేసిన పొరపాటు. ఇలాంటి ఘోర తప్పిదాలు చేయొద్దని యువ ఆటగాళ్లకు చెప్పడం ద్వారా ఆటకు నేను సేవ చేయగలను’ అని కనేరియా అన్నాడు.
కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు తీశాడు. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు మంచి విజయాలు అందించాడు. ఇంగ్లండ్‌లో 2010లో అతడు చివరి టెస్టు ఆడాడు. స్ఫాట్ ఫిక్సింగ్ కేసులోనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కనేరియాపై జీవిత కాల నిషేధం విధించింది. అతడి ఎసెక్స్ జట్టు సహచరుడు మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌ను ఫిక్సింగ్ చేయమని కనేరియా సూచించాడు. దాంతో ఫిక్సింగ్‌కు పాల్పడ్డ వెస్ట్‌ఫీల్డ్ జైలు శిక్ష అనుభవించాడు.
Comments
Please login to add a commentAdd a comment