Danish Kaneria Blasts Abdul Razzaq: టీమిండియాను తక్కువగా అంచనా వేస్తూ పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించాడు. చెత్త వాగడం సరికాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కోహ్లి, రోహిత్‌ను అవుట్ చేసినంత మాత్రాన భారత జట్టును ఓడించలేమని, ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో పాక్ చిత్తుగా ఓడిన విషయం మరిచిపోయావా అంటూ చురకలు అంటించాడు. అసలు పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ జట్టు సరిగా లేదన్న కనేరియా.. కోహ్లి సేన అన్ని విధాలా ఆధిక్యంలో ఉందని పేర్కొన్నాడు.
కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి సేన అసలు తమకు పోటీయే కాదని.. టీమిండియాకు అంత సీన్ లేదంటూ అబ్దుల్ రజాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్ల ప్రతిభ ముందు.. భారత ఆటగాళ్లు ఏమాత్రం పనికిరారంటూ అవమానకర రీతిలో మాట్లాడాడు. ఈ విషయంపై స్పందించిన కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా రజాక్‌కు కౌంటర్ ఇచ్చాడు.
ఈ మేరకు అతడు మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌లో అసలు నిలకడ ఉందా? కోహ్లి, రోహిత్‌ను అవుట్ చేస్తే... భారత జట్టును ఓడించడం సులభమమని రజాక్ చెబుతున్నాడు. నాన్‌సెన్స్.. అసలు టీమిండియాను మనవాళ్లు ఎలా ఓడించగలరు? పాకిస్తాన్ జట్టు కూర్పులోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల బ్యాటర్లు ఎక్కడ ఉన్నారు? ఇంగ్లండ్- బీ టీమ్ మనల్ని ఓడించింది. అసలు సెలక్షన్ ఎలా ఉందో చూశారా? ఇవన్నీ తెలిసి కూడా.. ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం సరికాదు’’ అని హితవు పలికాడు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు పొందిన పాకిస్తాన్ క్రికెటర్ నుంచి ఇది ఏ మాత్రం ఊహించలేదని చురకలు అంటించాడు.
ఇక అన్ని విభాగాల్లో టీమిండియా పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉందన్న కనేరియా... ‘‘ప్రతీ విభాగంలో వాళ్లు పటిష్టంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా వంటి ఎంతో మంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను ఎలా అవుట్ చేస్తారు? అన్నీ అంత సులభమేమీ కాదు కదా’’ అని పేర్కొన్నాడు.
ఇక బుమ్రా గురించి కూడా రజాక్ చేసిన వ్యాఖ్యలు సరికావన్న కనేరియా... ‘‘వసీం అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత యార్కర్లను అద్భుతంగా సంధించగల పర్‌ఫెక్ట్ బౌలర్ బుమ్రా. బుమ్రాను ఓడించగల యార్కర్ కింగ్ పాకిస్తాన్‌లో ఇంతవరకూ పుట్టలేదు. తన బౌలింగ్ అత్యద్భుతం. పాక్ బౌలర్లలో ఎవరూ తనకు అసలు పోటీనే కాదు’’ అని ప్రశంసలు కురిపించాడు.
చదవండి: Jason Holder: నయా సంచలనం ఉమ్రాన్‌పై హోల్డర్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment