విండీస్ ‘గంగ్‌నమ్’
ఆస్ట్రేలియాపై అద్భుత విజయం
స్యామీ సంచలన హిట్టింగ్
మెరిసిన క్రిస్ గేల్
వెస్టిండీస్ జట్టు టి20 ప్రపంచకప్ గెలిచినా ఇంత సంబరపడదేమో. మ్యాచ్‌కు ముందు రోజు ఆస్ట్రేలియా ఆటగాడు ఫాల్క్‌నర్ ‘మాకు వ్యక్తిగతంగా వెస్టిండీస్ క్రికెటర్లంటే ఇష్టం లేదు’ అని చేసిన వ్యాఖ్య కరీబియన్లలో కసి పెంచింది. మైదానంలోనే దీనికి సమాధానం చెబుతానన్న వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ.... ఫాల్క్‌నర్ బౌలింగ్‌లోనే రెండు సిక్సర్లు బాది విండీస్‌ను గెలిపించాడు. ఫలితం... గేల్ గంగ్‌నమ్ డ్యాన్స్ చేశాడు. కరీబియన్లు చిందేశారు.
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
మాటల యుద్ధంతో ప్రత్యర్థులను సగం ఓడించే ఆస్ట్రేలియన్లకు పెద్ద షాక్ తగిలింది. పెద్ద హిట్టర్లున్న జట్టును రెచ్చగొడితే ఫలితం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
రెండు ఓవర్లలో విజయానికి 31 పరుగులు అవసరమైన దశలో... విండీస్ కెప్టెన్ స్యామీ (13 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కేవలం పది బంతుల వ్యవధిలోనే 31 పరుగులు బాది జట్టును గెలిపించాడు. టి20ల్లో వెస్టిండీస్‌కిదే అత్యుత్తమ ఛేజింగ్ కావడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్సర్), వార్నర్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) వేగంగా ఆడినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హాడ్జ్ (26 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో కుదురుకుంది. చివర్లో హాడిన్ (7 బంతుల్లో 15 నాటౌట్) ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో బద్రీ, శామ్యూల్స్, నరైన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
వెస్టిండీస్ జట్టు 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. టోర్నీలో క్రిస్ గేల్ (35 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలిసారి తన శైలిలో వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. స్మిత్ (17), సిమ్మన్స్ (26) కూడా రాణించడంతో వెస్టిండీస్ 12 ఓవర్లలో 100 పరుగులు చేసింది.
అయితే ఆ తర్వాత పరుగుల వేగం నెమ్మదించడంతో చివరి నాలుగు ఓవర్లలో విండీస్ విజయానికి 53 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో డ్వేన్ బ్రేవో (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), స్యామీ చెలరేగారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 19 బంతుల్లోనే 49 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్యామీకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ ఓట మితో ఆసీస్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.
సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 178/8 (20 ఓవర్లలో) (మ్యాక్స్‌వెల్ 45; బద్రీ 2/37, శామ్యూల్స్ 2/20, నరైన్ 2/19) వెస్టిండీస్ ఇన్నింగ్స్: 179/4 (19.4 ఓవర్లలో) (గ్రేల్ 53; బ్రేవో నాటౌట్ 27; స్యామీ నాటౌట్ 34; స్టార్క్ 2/50).
టి20 ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ x నెదర్లాండ్స్
మధ్యాహ్నం గం. 3.00 నుంచి
ఇంగ్లండ్ x దక్షిణాఫ్రికా
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం