
మూడు కోట్లతో పుట్టినరోజు పార్టీ
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెకమ్ తన 40వ పుట్టినరోజును ఘనంగా చేసుకున్నారు. మొరాకోలోని అమెంజనా లగ్జరీ రిసార్ట్‌లో శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన పుట్టిన రోజు వేడుకలు ఆదివారం వరకు కొనసాగాయి. అరేబియా థీమ్‌తో జరిగిన వేడుకల్లో హాలీవుడ్ తారలు, ఫ్యాషన్ డిజైనర్లు, సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అతిథుల అభిరుచులకు తగినట్టుగా అన్ని రకాల విందు భోజనాలను ఏర్పాటు చేశారు.
వంద మందికి పైగా రిసార్ట్ సిబ్బంది బెకమ్ పుట్టినరోజు వేడుకల్లో తలమునకలయ్యారు. ఈ వేడుకలకు దాదాపు రూ. మూడు కోట్ల వరకు ఖర్చయినట్లు అంచనా. 'ఇన్‌స్టాగ్రామ్' ఖాతాలేని డేవిడ్ బెకమ్ తన పుట్టినరోజు నాడే ఖాతా తెరిచి, తన వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్టు చేయడం ద్వారా ఒక్క రోజునే 40 లక్షల మంది అనుచరులను సంపాదించుకున్నారు.