'ఆ ఫోటో చూసి షాక్‌కు గురయ్యా' | David Warner Expresses Shock About Person Seeing Australia Bush Fire | Sakshi
Sakshi News home page

ఆ ఫోటో చూసి షాక్‌కు గురయ్యా : వార్నర్‌

Published Thu, Jan 2 2020 2:33 PM | Last Updated on Thu, Jan 2 2020 2:44 PM

David Warner Expresses Shock About Person Seeing Australia Bush Fire  - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్టును షేర్‌ చేసి ఆస్ట్రేలియా ప్రజలకు ఒక సందేశాన్నిచ్చాడు. కాగా ఈ పోస్టులో ఒక వ్యక్తి తన కుక్కతో పాటు సముద్రం బీచ్‌ ఒడ్డున కూర్చొని ఎదురుగా మంటల్లో కాలిపోతున్న చెట్లను చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రోజు రోజుకి మంటల తీవ్రత పెరిగిపోతుంది. తాజాగా ఈ మంటలు సిడ్నీ పరిసర ప్రాంతాల అడవులకు కూడా వ్యాపించాయి. కాగా శుక్రవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ సిడ్నీలో జరగనుంది. ఈ సందర్భంగా డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్‌ చేస్తూ తన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

'నేను ఇప్పుడే  ఒక వ్యక్తి తన కుక్కతో పాటు బీచ్‌లో కూర్చొని చెలరేగుతున్న మంటలను తదేకంగా చూస్తున్న ఫోటో ఒకటి చూశాను. నేను ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆస్ట్రేలియా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు దేశాన్ని విపత్కర పరిస్థితులకు నెట్టేసింది. దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి, వాలంటీర్లను మనం గౌరవించాలి. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మాతో పాటు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కలిసి వచ్చి వారు చేస్తున్న పోరాటానికి సెల్యూట్‌ చేస్తారని ఆశిస్తున్నా. దేశం రక్షణ కోసం పోరాడుతున్న మీకు మేము, మా కుటుంబాలు అండగా ఉంటాయి. దేశాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన మీరే నిజమైన హీరోలంటూ' వార్నర్‌ భావోద్వేగ పోస్టును పెట్టాడు. వార్నర్‌ పెట్టిన పోస్టుకు అతని అభిమానుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ప్రస్తుతం సిడ్నీలో నెలకొన్న పరిస్థితులతో మ్యాచ్‌కు అంతతరాయం కలిగే అవకాశం ఉందని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆపరేషన్‌ హెడ్‌ పీటర్‌ రోచ్‌ వెల్లడించారు. అయితే మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు కార్చిచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరేందుకు ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారని తెలిపారు. 
(చదవండి : ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. ముగ్గురు మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement