రైజర్... విన్నర్
► ఐపీఎల్‌లో హైదరాబాద్ తొలి విజయం కెప్టెన్ వార్నర్ సూపర్ ఇన్నింగ్స్
► రాణించిన బౌలర్లు 7 వికెట్లతో ముంబై ఇండియన్స్ చిత్తు
రెండు రోజుల క్రితం ఇదే మైదానంలో 142 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఓటమిని ఆహ్వానించింది. ఇప్పుడు సరిగ్గా అదే స్కోరును ఛేదించి లీగ్‌లో బోణీ చేసింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన హైదరాబాద్‌కు ఆ తర్వాత కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ మెరుపులు కీలక విజయాన్ని అందించాయి. రెండు పరాజయాల తర్వాత దక్కిన విజయం రైజర్స్‌లో ఆనందం నింపింది.
పేరుకు పెద్ద హిట్టర్లే ఉన్నా... బ్యాటింగ్‌లో తడబడిన ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. రాయుడు, కృనాల్ భాగస్వామ్యం మినహా ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. భారీ స్కోరు చేయడంలో విఫలమై ఆ జట్టు మూడో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. సోమవారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్లతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అంబటి రాయుడు (49 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 15 బంతులు ఉండగానే సన్‌కు విజయం దక్కడం విశేషం.
63 పరుగుల భాగస్వామ్యం: ఐపీఎల్ కెరీర్ ఆరంభం గప్టిల్ (2)కు కలిసి రాలేదు. లీగ్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న అతను, భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత శరణ్ చక్కటి బంతులతో పార్థివ్ (10), బట్లర్ (11)లను అవుట్ చేశాడు. అంతకుముందు నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్ (5) కూడా అనవసర సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక రనౌటయ్యాడు. తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఆ సమయానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో రాయుడు, కృనాల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రాయుడు చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా, గత మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్న కృనాల్ మరోసారి చెలరేగాడు. ముందుగా నెమ్మదిగా ఆడిన వీరిద్దరు ఆ తర్వాత ధాటిని ప్రదర్శించారు. సన్ ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా చకచకా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 43 బంతుల్లో రాయుడు అర్ధసెంచరీ పూర్తయింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 39 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాయుడుతో పాటు హార్దిక్ (2) కూడా అవుటైనా కృనాల్ చివరి వరకు నిలబడ్డాడు. తొలి 10 ఓవర్లలో 58 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, తర్వాతి 10 ఓవర్లలో 84 పరుగులు చేసింది.
వార్నర్ ఒక్కడే: ఎప్పటిలాగే ధావన్ (2) వైఫల్యంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. సౌతీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికే అతను వెనుదిరిగాడు. అయితే రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ ఫోర్, సిక్స్ బాది దూకుడును మొదలు పెట్టాడు. మరో ఎండ్‌లో హర్భజన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన హెన్రిక్స్ (22 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు వార్నర్‌కు అండగా నిలిచాడు. 10 ఓవర్లలో రైజర్స్ స్కోరు 66 పరుగులకు చేరిన తర్వాత సౌతీ చక్కటి బంతితో హెన్రిక్స్‌ను అవుట్ చేయగా... ఆ తర్వాత మోర్గాన్ (11) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. మరో వైపు భారీ షాట్లతో తన జోరు కొనసాగించిన వార్నర్ 42 బంతుల్లో ఈ సీజన్‌లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించిన అతను కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. చివర్లో దీపక్ హుడా (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) అండతో అతను మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; పార్థివ్ (బి) శరణ్ 10; రాయుడు (సి) హెన్రిక్స్ (బి) శరణ్ 54; రోహిత్ (రనౌట్) 5; బట్లర్ (సి) నమన్ ఓజా (బి) శరణ్ 11; కృనాల్ (నాటౌట్) 49; హార్దిక్ (బి) ముస్తఫిజుర్ 2; హర్భజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-2; 2-23; 3-43; 4-60; 5-123; 6-135.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-17-1; శరణ్ 4-0-28-3; హెన్రిక్స్ 4-0-23-0; ముస్తఫిజుర్ 4-0-32-1; బిపుల్ శర్మ 4-0-40-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 90; ధావన్ (బి) సౌతీ 2; హెన్రిక్స్ (సి) పార్థివ్ (బి) సౌతీ 20; మోర్గాన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 11; దీపక్ హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 145.
వికెట్ల పతనం: 1-4; 2-66; 3-100.; బౌలింగ్: సౌతీ 4-0-24-3; మెక్లీన్‌గన్ 3.3-0-33-0; జస్‌ప్రీత్ బుమ్రా 3-0-19-0; హర్భజన్ సింగ్ 4-0-38-0; హార్దిక్ పాండ్యా 3-0-29-0.