వార్నర్ వండర్ | David Warner masterclass powers SRH into final | Sakshi
Sakshi News home page

వార్నర్ వండర్

Published Sat, May 28 2016 12:50 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

వార్నర్ వండర్ - Sakshi

వార్నర్ వండర్

ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్
సన్‌రైజర్స్‌ను గెలిపించిన కెప్టెన్  అండగా నిలిచిన బిపుల్ శర్మ
రేపు బెంగళూరుతో టైటిల్ పోరు

 
 
ఏమని వర్ణించాలి... మాటల్లేవ్... అసలు ఇదెలా సాధ్యం... ఒక్క క్రికెటర్ ఒకే మ్యాచ్‌లో ఇన్ని కోణాలు ఎలా చూపించగలిగాడు...? కోహ్లి మాయలో కొట్టుకుపోతున్న ఐపీఎల్‌లో ఈ సీజన్‌కే ఆణిముత్యంలాంటి ఇన్నింగ్స్ ఇది. తపన, పట్టుదల, అంకితభావం ఉన్న ఓ మహా క్రికెటర్ చేసిన విన్యాసం ఇది. ఎదురుగా కొండలా లక్ష్యం కనిపిస్తున్నా... పిచ్ బ్యాటింగ్‌కు క్లిష్టంగా ఉన్నా... ప్రత్యర్థులు మాటలతో కవ్విస్తున్నా... సహచరులు బ్యాటులెత్తేస్తున్నా... వార్నర్‌లోని పోరాట యోధుడు మాత్రం ఏ క్షణంలోనూ తడబడలేదు.

ఓ వేటగాడిలా ఓపికగా చెత్త బంతి కోసం నిరీక్షించాడు... ఓ జెంటిల్‌మన్‌లా మంచి బంతుల్ని గౌరవించాడు... ఓ సారథిలా సహచరుల్లో స్థైర్యం నింపాడు... మొత్తానికి రాజులా జట్టును గెలిపించాడు. సన్‌రైజర్స్ ఐపీఎల్ టైటిల్ ఆశలను సజీవంగా నిలిపాడు. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్‌లో వార్నర్ మ్యాజిక్‌ను చూడకపోతే ఓ నాణ్యమైన ఇన్నింగ్స్‌ను మిస్ అయినట్లే..!

గత రెండేళ్లలో వార్నర్ హైదరాబాద్ తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ప్రతి సీజన్‌లోనూ మిగతా జట్టంతా విఫలమైనా ఒక్కడే పోరాడాడు. ఈ సీజన్‌లో మిగిలిన వాళ్లు ఫర్వాలేదనిపించినా... చావోరేవో తేల్చుకోవాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సహచరులు మళ్లీ చేతులెత్తేశారు. అయినా వార్నర్ ఒంటరి పోరాటంతో సన్ గట్టెక్కింది. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన కోహ్లి బృందం టైటిల్ గెలుస్తామనే ధీమాతో ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో వార్నర్ ఇన్నింగ్స్ చూస్తే మాత్రం... వాళ్లంతా ఎలర్ట్ కావల్సిందే..!
 
 
న్యూఢిల్లీ: డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-9లో ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకోగా... గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఫించ్ (32 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మెకల్లమ్ (29 బంతుల్లో 32; 5 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (19 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసి నెగ్గింది. బిపుల్ శర్మ (11 బంతుల్లో 27 నాటౌట్; 3 సిక్సర్లు) ఆఖర్లో షో చూపెట్టాడు.  


 ఫించ్ జోరు
మ్యాచ్ ఆరంభం నుంచే పట్టు బిగించిన సన్ బౌలర్లు... తొలి ఓవర్‌లోనే ద్వివేదిని (5), నాలుగో ఓవర్‌లో కెప్టెన్ రైనా (1)ను అవుట్‌చేయడంతో లయన్స్ ఒత్తిడిలో పడింది. అయితే దీన్ని అధిగమించడానికి మెకల్లమ్ కొన్ని భారీ షాట్లు కొట్టినా హైదరాబాద్ ఫీల్డర్లు అడ్డుకున్నారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్ 2 వికెట్లకు 38 పరుగులు మాత్రమే చేసింది. తొమ్మిదో ఓవర్‌లో ఓ ఫోర్, సిక్స్‌తో జోరు పెంచిన కార్తీక్ తర్వాతి బంతికే రనౌటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన ఫించ్ యాంకర్ పాత్రతో ఆకట్టుకున్నా... రెండో ఎండ్‌లో ఐదు బంతుల తేడాలో మెకల్లమ్, స్మిత్ (1) అవుటయ్యారు. తర్వాత వచ్చిన జడేజా (19 నాటౌట్) నెమ్మదిగా ఆడినా... 14వ ఓవర్‌లో ఫించ్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 17 పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరి సమన్వయంతోపాటు సన్ ఫీల్డింగ్ వైఫల్యంతో తర్వాతి ఓవర్లలో లయన్స్ ఇన్నింగ్స్ బాగా పుంజుకుంది.

31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఫించ్ ఆరో వికెట్‌కు 29 బంతుల్లోనే 51 పరుగులు జత చేసి 18వ ఓవర్‌లో అవుట్‌కాగా... ఆఖర్లో బ్రేవో (10 బంతుల్లో 20; 4 ఫోర్లు) ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఏడో వికెట్‌కు కేవలం 12 బంతుల్లోనే 24 పరుగులు జోడించడంతో లయన్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భువనేశ్వర్, కటింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.


 బిపుల్ ‘షో’
లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌కు రెండో ఓవర్‌లో ధావన్ (0) రనౌట్‌తో ఎదురుదెబ్బ తగిలింది. తర్వాత వార్నర్, హెన్రిక్స్ (11) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా... ఐదో ఓవర్‌లో స్మిత్ ఈ జోడిని విడగొట్టి మళ్లీ దెబ్బతీశాడు. ఓవరాల్‌గా పవర్‌ప్లేలో సన్ స్కోరు 46/2కు చేరింది. అయితే వార్నర్ నిలకడతో ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో యువరాజ్ (8) పేలవమైన షాట్‌తో తొమ్మిదో ఓవర్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 28 పరుగులు జతయ్యాయి. ఇక తొలి 10 ఓవర్లలో 66/3 స్కోరుతో ఉన్న హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను వార్నర్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నా... రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో దీపక్ హుడా (4), కటింగ్ (8), నమన్ ఓజా (10)లు వెనుదిరిగారు. 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 19 పరుగులు రాబట్టిన వార్నర్.. ఓజాతో ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించాడు. ఇక 24 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో బిపుల్ శర్మ లయన్స్ బౌలర్లకు షో చూపెట్టాడు. అతను మూడు సిక్సర్లు బాదితే.. వార్నర్ మూడు ఫోర్లతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే సన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.


స్కోరు వివరాలు
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ద్వివేది (సి) బౌల్ట్ (బి) భువనేశ్వర్ 5; మెకల్లమ్ (సి) భువనేశ్వర్ (బి) బిపుల్ శర్మ 32; రైనా ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 1; కార్తీక్ రనౌట్ 26; ఫించ్ (బి) కటింగ్ 50; స్మిత్ (సి) ధావన్ (బి) కటింగ్ 1; జడేజా నాటౌట్ 19; బ్రేవో (బి) భువనేశ్వర్ 20; ధవల్ కులకర్ణి నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162.

వికెట్ల పతనం: 1-7; 2-19; 3-63; 4-81; 5-83; 6-134; 7-158.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-2; బౌల్ట్ 4-0-39-1; బరీందర్ 3-0-28-0; బిపుల్ శర్మ 3-0-21-1; కటింగ్ 3-0-20-2; హెన్రిక్స్ 3-0-27-0.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ నాటౌట్ 93; ధావన్ రనౌట్ 0; హెన్రిక్స్ (సి) ద్వివేది (బి) స్మిత్ 11; యువరాజ్ (సి) స్మిత్ (బి) కౌశిక్ 8; దీపక్ హుడా ఎల్బీడబ్ల్యు (బి) బ్రేవో 4; కటింగ్ (సి) కార్తీక్ (బి) కౌశిక్ 8; నమన్ ఓజా (సి) జడేజా (బి) బ్రేవో 10; బిపుల్ శర్మ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 163.

వికెట్ల పతనం: 1-6; 2-33; 3-61; 4-75; 5-84; 6-117.
బౌలింగ్: ప్రవీణ్ 3.2-0-32-0; ధవల్ కులకర్ణి 4-0-32-0; స్మిత్ 2-0-29-1; రైనా 2-0-15-0; కౌశిక్ 4-0-22-2; బ్రేవో 4-0-32-2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement