‘శత’క్కొట్టిన వార్నర్
నాలుగో వన్డేలో పాక్‌పై ఆసీస్ విజయం
సిడ్నీ: ఓపెనర్ డేవిడ్ వార్నర్ (119 బంతుల్లో 130; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ సెంచరీతో తన భీకర ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. దీంతో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 86 పరుగుల తేడాతో ఘనవిజయం సాధిం చింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ జోరుకు తమ పేలవ ఫీల్డింగ్ తోడవ్వడంతో పాక్ తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ గెలుపుతో ఆసీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఐదు వన్డేల సిరీస్‌ను 3–1తో దక్కించుకున్నట్టయింది. ఐదో వన్డే ఈనెల 26న అడిలైడ్‌లో జరుగుతుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 353 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ స్మిత్ (48 బంతుల్లో 49; 5 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు వార్నర్ 120 పరుగులు జోడించాడు. 98 బంతుల్లో వార్నర్ తన కెరీర్‌లో 12వ సెంచరీని సాధించాడు. అలాగే తన చివరి ఆరు వన్డేల్లో అతనికిది మూడో సెంచరీ. చివర్లో మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 78; 10 ఫోర్లు, 1 సిక్స్) తన సహజశైలిలో ఆడడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 43.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షర్జీల్ ఖాన్ (47 బంతుల్లో 74; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. హాజెల్‌వుడ్, జంపాలకు మూడేసి వికెట్లు దక్కాయి.