మన చేతుల్లోనే! | Day 3: India end day's play at 70/1 against Sri Lanka | Sakshi
Sakshi News home page

మన చేతుల్లోనే!

Published Sun, Aug 23 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

మన చేతుల్లోనే!

మన చేతుల్లోనే!

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 70/1  
ఓవరాల్ ఆధిక్యం 157 పరుగులు
తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 306 ఆలౌట్  
మ్యాథ్యూస్ సెంచరీ

 
 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో విజయ్, రహానేల సమయోచిత ప్రదర్శనతో మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో టెస్టు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న 157 పరుగుల ఆధిక్యానికి నాలుగో రోజు వీలైనన్ని పరుగులు జోడిస్తే... టీమిండియా మ్యాచ్‌పై   ఆశలు పెట్టుకోవచ్చు. అయితే తొలి టెస్టులో మాదిరిగా లంకేయులు అద్భుతం చేయకుండా జాగ్రత్తపడాలి.
 
 కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం దిశగా సాగుతోంది. నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా.. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమైంది. ఫలితంగా 140/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 87 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ మ్యాథ్యూస్ (167 బంతుల్లో 102; 12 ఫోర్లు) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో తిరిమన్నే (168 బంతుల్లో 62; 5 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. మిశ్రాకు 4 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 29.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విజయ్ (39 బ్యాటింగ్), రహానే (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 157 పరుగుల ఆధిక్యంలో ఉంది.  
 
 సెషన్-1: నెమ్మదిగా పరుగులు
 ఓవర్లు: 28; పరుగులు: 84; వికెట్లు: 0

 పేసర్లకు వికెట్ నుంచి సహకారం లేకపోవడంతో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ తిరిమన్నే, మ్యాథ్యూస్‌లు నిలకడగా ఆడారు. ఇషాంత్ వేసిన సెషన్ ఐదో బంతి.. తిరిమన్నే బ్యాట్ ఎడ్జ్‌ను తాకి ఫస్ట్ స్లిప్‌లోకి వెళ్లింది. కీపర్ సాహా డైవ్ చేసినా అందలేదు. ఇది మినహా ఈ సెషన్ మొత్తం వీరిద్దరు చాలా మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. అయితే రన్‌రేట్ పెరగకుండా భారత బౌలర్లు చాలా జాగ్రత్తగా బంతులు వేశారు. స్పిన్నర్లు కొద్దిగా ప్రభావం చూపెట్టినా.. బ్యాట్స్‌మన్ ఆచితూచి ఆడటంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో మ్యాథ్యూస్ 81 బంతుల్లో, తిరిమన్నే 142 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓవరాల్‌గా 73వ ఓవర్‌లో 200 పరుగులకు చేరిన లంక లంచ్ వరకు 3 వికెట్లకు 224 పరుగులు సాధించింది. ఎన్ని బౌలింగ్ మార్పులు చేసినా భారత్‌కు వికెట్ దక్కలేదు.
 
 సెషన్-2: పుంజుకున్న భారత్
 ఓవర్లు: 22; పరుగులు: 74; వికెట్లు: 4

 ఈ సెషన్‌లో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 33 నిమిషాల ఆట వృథా అయ్యింది. ఈ అవకాశాన్ని ఇషాంత్ సూపర్‌గా సద్వినియోగం చేసుకున్నాడు. అశ్విన్, మిశ్రా కూడా చక్కని సహకారం అందించారు. 85వ ఓవర్‌లో ఇషాంత్ ఫుల్ లెంగ్త్ బంతిని డ్రైవ్ చేయబోయి తిరిమన్నే సాహా చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌కు నెలకొన్న 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే చండిమల్ (11)నూ వెనక్కి పంపాడు. రెండో ఎండ్‌లో మ్యాథ్యూస్ నెమ్మదిగా ఆడి 164 బంతుల్లో కెరీర్‌లో 6వ శతకాన్ని పూర్తి చేశాడు. ఈ దశలో విరాట్ చికిత్స కోసం బయటకు వెళ్లగా రహానే కెప్టెన్సీ చేశాడు. 99వ ఓవర్‌లో బిన్నీ.. ఊహించని రీతిలో మ్యాథ్యూస్‌ను అవుట్ చేసి టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. ఆ వెంటనే దమ్మిక ప్రసాద్ (5)ను మిశ్రా బోల్తా కొట్టించాడు. ఓవరాల్‌గా 224/3 స్కోరుతో పటిష్టంగా ఉన్న లంక సెషన్ ముగిసేసరికి 298/7గా మారింది.
 
 సెషన్-3: బ్యాట్స్‌మెన్ నిలకడ
 ఓవర్లు: 5; పరుగులు: 8;  వికెట్లు: 3 (శ్రీలంక)
 ఓవర్లు: 29.2; పరుగులు: 70; వికెట్లు: 1 (భారత్)

 టీ తర్వాత మిశ్రా విజృంభించాడు. స్వల్ప విరామాల్లో ముబారక్ (22), తరిండ్ కౌశల్ (6)ను అవుట్ చేశాడు. రెండో ఎండ్‌లో అశ్విన్... హెరాత్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఐదో బంతికే లోకేశ్ రాహుల్ (2)ను అవుట్ చేసి దమ్మిక ప్రసాద్ షాక్ ఇచ్చాడు. దీంతో కోహ్లిసేన స్కోరు 3/1గా మారింది. తర్వాత విజయ్, రహానేలు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. పేసర్ల నుంచి ఒత్తిడి ఎదురైనా... భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఒకటి, రెండుసార్లు ఎల్బీడబ్ల్యు అప్పీల్‌ల నుంచి బయటపడి స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు కదలించారు. ఓవరాల్‌గా మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడి విజయ్, రహానే రోజును ముగించారు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 393 ఆలౌట్

 శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 1; సిల్వ (సి) అశ్విన్ (బి) మిశ్రా 51; సంగక్కర (సి) రహానే (బి) అశ్విన్ 32; తిరిమన్నే (సి) సాహా (బి) ఇషాంత్ 62; మ్యాథ్యూస్ (సి) విజయ్ (బి) బిన్నీ 102; చండిమల్ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 11; ముబారక్ (బి) మిశ్రా 22; ప్రసాద్ (సి) రహానే (బి) మిశ్రా 5; హెరాత్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 1; తరిండ్ కౌశల్ (స్టం) సాహా (బి) మిశ్రా 6; చమీరా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (108 ఓవర్లలో ఆలౌట్) 306.
 వికెట్ల పతనం: 1-1; 2-75; 3-114; 4-241; 5-259; 6-284; 7-289; 8-300; 9-306; 10-306.
 
 బౌలింగ్: ఇషాంత్ 21-3-68-2; ఉమేశ్ 19-5-67-1; బిన్నీ 18-4-44-1; అశ్విన్ 29-3-76-2; మిశ్రా 21-3-43-4.
 
 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 39; రాహుల్ (బి) ప్రసాద్ 2; రహానే బ్యాటింగ్ 28; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (29.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 70. వికెట్ల పతనం: 1-3.
 బౌలింగ్: ప్రసాద్ 4-0-12-1; హెరాత్ 11.2-3-23-0; చమీరా 4-0-14-0; మ్యాథ్యూస్ 2-1-1-0; కౌశల్ 8-0-20-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement