‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా! | On This Day, Shane Warne's Ball Of The Century | Sakshi
Sakshi News home page

‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!

Published Thu, Jun 4 2020 3:26 PM | Last Updated on Thu, Jun 4 2020 3:41 PM

On This Day, Shane Warne's Ball Of The Century - Sakshi

న్యూఢిల్లీ: షేన్‌ వార్న్‌.. ఆస్ట్రేలియా క్రికెట్‌ స్పిన్‌కు వన్నె తెచ్చిన దిగ్గజం. స్పిన్‌ మాంత్రికుడు అనే పేరుకు సరిగ్గా సరిపోతాడు వార్న్‌. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్‌(708 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడంటే అతని ప్రతిభ ఏపాటిదో మనకు అర్థమైపోతుంది. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించడమే కాకుండా ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా నిలిచేవాడు‌.  కాగా, సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భాగంగా వార్న్‌ వేసిన ఒక బంతి ఇప్పటికీ ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గానే పిలవబడుతోంది.1993లో ఇంగ్లండ్‌తో వారి దేశంలో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో వార్న్‌ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. (షోయబ్‌ అక్తర్‌కు సమన్లు)

ఆ టెస్టు మ్యాచ్‌ జూన్‌ 3వ తేదీన ఆరంభం కాగా,  రెండో రోజు ఆట(జూన్‌ 4వ తేదీన)లో ఇంగ్లండ్‌ దిగ్గజ ఆటగాడు మైక్‌ గాటింగ్‌ను బోల్తా కొట్టించిన తీరు వార్న్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. లెగ్‌ స్పిన్‌లో ఒక విలక్షమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న వార్న్‌.. బంతిని నేరుగా గాటింగ్‌ కాళ్లకు ముందు అవుట్‌సైడ్‌ లెగ్‌స్టంప్‌పై వేసి ఆఫ్‌ వికెట్‌ను ఎగరుగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్‌ అంచనా వేసే లోపే ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఆ బంతికి గాటింగ్‌ షాక్‌ కాగా, ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌కు కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదంటే అది ఎంతలా స్పిన్‌ అయ్యి ఉంటుందో( ఎంతలా స్పిన్‌ చేశాడో) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో వార్న్‌దే కీలక పాత్ర. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు సాధించి ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చాడు. వార్న్‌ కెరీర్‌కు పునాది పడిన సందర్భం కచ్చితంగా అదే టెస్టు మ్యాచ్‌. 1992లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన వార్న్‌.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజాల సరసన నిలిచిపోయాడు.

బోర్డర్‌ నమ్మకాన్ని నిలబెట్టిన వేళ..
ఆ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 68 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ ఆరంభం బాగానే ఉన్నా ఆపై వరుస వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో మార్క్‌ టేలర్‌ సెంచరీ, స్లేటర్‌ హాఫ్‌ సెంచరీ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 289 పరుగుల వద్ద ముగించింది. దాంతో రెండో రోజు ఆటను ఇంగ్లండ్ ఆరంభించింది. ఆ సమయంలో యువ సంచలనంగా పేరు తెచ్చుకున్న మైక్‌‌ అథర్టన్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించగా, అతనికి జతగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ గ్రాహం గూచ్‌ ఫీల్డ్‌లోకి వచ్చాడు. అయితే అథర్టన్‌ను తొలి వికెట్‌గా హ్యూజ్‌ ఔట్‌ చేసిన తర్వాత ఇంగ్లండ్‌ పతనం ఆరంభమైంది.(బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప)

తొలి వికెట్‌ పడ్డ తర్వాత గ్రాహం గూచ్‌కు మైక్‌ గాటింగ్‌ జత కలిశాడు. అప్పటికే గాటింగ్‌ దిగ్గజ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ఆసీస్‌ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌.. లెగ్‌ స్పిన్‌ ప్రయోగాన్ని ఇంగ్లండ్‌పై ప్రయోగించాడు. ఆ క్రమంలోనే వార్న్‌ చేతికి బంతి ఇవ్వాలని నిశ్చయించాడు. ఆ నమ్మకాన్ని వార్న్‌ వమ్ము చేయలేదు. గాటింగ్‌ను ఒక వైవిధ్యమైన బంతికి ఔట్‌ చేయడమే కాకుండా ఆ ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు సాధించి ఆసీస్‌ పైచేయి సాధించేలా చేశాడు. షేన్‌ వార్న్‌ తన కెరీర్‌లో ఎన్ని అద్భుతమైన బంతులు వేసినా ఇప్పటికీ గాటింగ్‌కు వేసిన బంతే బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా ఉంది. వార్న్‌ కెరీర్‌కు పునాది పడిన ఆనాటి మ్యాచ్‌లోని గాటింగ్‌ ఔట్‌ను మరొకసారి చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement