ఏబీ.. అదే జోరు | De Villiers scores century as SA and Indian XI draw | Sakshi
Sakshi News home page

ఏబీ.. అదే జోరు

Published Sun, Nov 1 2015 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

ఏబీ.. అదే జోరు

ఏబీ.. అదే జోరు

* సెంచరీ బాదిన డివిలియర్స్
* భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’
ముంబై: మ్యాచ్ ఎలాంటిదైనా దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (131 బంతుల్లో 112; 18 ఫోర్లు) జోరు మాత్రం తగ్గడం లేదు. బోర్డు ప్రెసిడెంట్ జట్టు కుర్ర బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ సెంచరీతో శివాలెత్తాడు. దీంతో ఇరుజట్ల మధ్య శనివారం ముగిసిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. డివిలియర్స్‌కు తోడు విలాస్ (78 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బోర్డు జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. రాహుల్ (43 నాటౌట్), పుజారా (49 నాటౌట్) ఆకట్టుకున్నారు. అంతకుముందు 46/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రొటీస్... స్వల్ప వ్యవధిలో ఎల్గర్ (23), డు ప్లెసిస్ (4), ఆమ్లా (1)ల వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ దెబ్బకు సఫారీ జట్టు 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్ బోర్డు బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు.

పేస్ బౌలింగ్‌లో కాస్త నియంత్రణతో ఆడిన ఏబీ.. కరణ్ శర్మ స్పిన్‌ను దారుణంగా దెబ్బతీశాడు. కట్, స్వీప్, ఫుల్, డ్రైవ్‌లతో వరుస బౌండరీలు బాదాడు. బావుమా (15)తో కలిసి ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించిన డివిలియర్స్... విలాస్‌తో కలిసి ఏడో వికెట్‌కు 115 పరుగులు సమకూర్చాడు. చివరకు టీ తర్వాత స్పిన్నర్ జయంత్... ఏబీని అవుట్ చేయడంతో బోర్డు జట్టు ఊపిరి పీల్చుకుంది. ఫిలాండర్ (12) విఫలమైనా... స్టెయిన్ (28 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లు ఆడటంతో ప్రొటీస్ స్కోరు మూడొందలు దాటింది. శార్దూల్ 4, జయంత్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.
 
స్కోరు వివరాలు
భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: వాన్‌జెల్ (సి) ఉన్ముక్త్ (బి) ఠాకూర్ 18; ఎల్గర్ (సి) ఉన్ముక్త్ (బి) సింగ్ 23; హర్మర్ (సి) ఓజా (బి) ఠాకూర్ 4; డు ప్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఠాకూర్ 4; ఆమ్లా (సి) నాయర్ (బి) ఠాకూర్ 1; డివిలియర్స్ (బి) జయంత్ 112; బావుమా (సి) అయ్యర్ (బి) పాండ్యా 15; విలాస్ (బి) జయంత్ 54; ఫిలాండర్ (బి) కుల్దీప్ 12; స్టెయిన్ (బి) కుల్దీప్ 37; రబడ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: (69.2 ఓవర్లలో ఆలౌట్) 302.
వికెట్ల పతనం: 1-38; 2-46; 3-54; 4-57; 5-57; 6-111; 7-226; 8-259; 9-285; 10-302.
బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 16-3-70-4; నాథ్ సింగ్ 14.4-2-56-1; హార్డిక్ పాండ్యా 14-1-64-1; కరణ్ శర్మ 8-0-43-0; జయంత్ యాదవ్ 8-2-37-2; కుల్దీప్ యాదవ్ 8.4-0-24-2.
 
భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 43; పుజారా నాటౌట్ 49; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: (30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 92; బౌలింగ్: హర్మర్ 10-2-24-0; పిడెట్ 10-3-32-0; తాహిర్ 5-0-25-0; ఎల్గర్ 5-0-11-0.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement