హుడా... దడదడ! | Deepak Hooda steers Rajasthan Royals to win over Delhi Daredevils | Sakshi
Sakshi News home page

హుడా... దడదడ!

Published Mon, Apr 13 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

హుడా... దడదడ!

హుడా... దడదడ!

  •  చివరి బంతికి రాజస్థాన్ గెలుపు
  • 3 వికెట్లతో ఓడిన ఢిల్లీ
  • డుమిని, తాహిర్ శ్రమ వృథా
  •  న్యూఢిల్లీ: రాజస్తాన్ లక్ష్యం 185 పరుగులు... అజింక్య రహానే (39 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), దీపక్ హుడా (25 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో ఓ దశలో 18 ఓవర్లలో 166/5... ఇక గెలవాలంటే 12 బంతుల్లో 19 పరుగులు చేయాలి. ఓ ఎండ్‌లో ఫాల్క్‌నర్ (11 బంతుల్లో 17; 2 ఫోర్లు)... మరో ఎండ్‌లో హుడా...ఇక రాజస్తాన్ గెలుపు ఖాయమే అనుకుంటున్న దశలో... తాహిర్ 19వ ఓవర్ తొలి బంతి వేశాడు... హుడా బలంగా గాల్లోకి లేపాడు..లాంగాన్‌లో మ్యాథ్యూస్ చూడచక్కని క్యాచ్ అందుకున్నాడు. రాజస్తాన్ శిబిరంలో కాస్త ఆందోళన.. అయినా ఏదో ఓ మూలన ఫాల్క్‌నర్ ఉన్నాడన్నా భరోసా.. తర్వాతి రెండు బంతుల్లో ఓ దాన్ని సిక్సర్‌గా మలిచిన మోరిస్ (6 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మరో సింగిల్ తీసి ఫాల్క్‌నర్‌కు స్ట్రయికింగ్ ఇచ్చాడు. కానీ ఐదో బంతికి ఫాల్క్‌నర్ క్లీన్‌బౌల్డ్. అంతే ఒక్కసారిగా మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది.
     
     ఇక చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాలి. మోరిస్‌తో పాటు సౌతీ (4 బంతుల్లో 7 నాటౌట్; 1 ఫోర్) క్రీజులో ఉన్నాడు. మ్యాథ్యూస్ ఐదు బంతులకు 9 పరుగులు ఇచ్చాడు. ఇక విజయసమీకరణం.. ఒక బంతి... మూడు పరుగులు... డుమిని ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు... మ్యాథ్యూస్ ఫుల్ లెంగ్త్ వేశాడు... సౌతీ కవర్స్‌లోకి బలంగా బాదాడు. బంతి బౌండరీ దాటింది. రాజస్తాన్ విజయాల సంఖ్య రెట్టింపైంది.. కానీ ఢిల్లీ సుడి మాత్రం మారలేదు. ఐపీఎల్-8లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్టీవెన్ స్మిత్ సేన 3 వికెట్ల తేడాతో డుమిని బృందంపై గెలిచింది.
     
     టాస్ గెలిచి రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.... బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఆరంభంలో రాజస్తాన్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాస్ అయ్యర్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడుతూ తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ డుమిని (38 బంతుల్లో 44 నాటౌట్; 3 సిక్సర్లు) వేగంగా ఆడుతూ మూడు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. అయ్యర్‌తో కలిసి రెండో వికెట్‌కు 48; యువరాజ్ (17 బంతుల్లో 27; 2 సిక్సర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 45; మ్యాథ్యూస్ (14 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 46 పరుగులు జోడించాడు.
     
     తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. శామ్సన్ (11), స్మిత్ (10), నాయర్ (20), బిన్నీ (1) విఫలం కావడంతో రాజస్తాన్ 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీపక్ హుడా కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లను దడదడలాడిస్తూ రహానేతో కలిసి ఐదో వికెట్‌కు 52; ఫాల్క్‌నర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ త్రయం అవుటైనా.. చివర్లో మోరిస్, సౌతీ మెరుగ్గా ఆడి విజయాన్ని ఖాయం చేశారు. హుడాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.  
     
     స్కోరు వివరాలు
     ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) తాంబే 37; శ్రేయాస్ అయ్యర్ (సి) సౌతీ (బి) మోరిస్ 40; డుమిని నాటౌట్ 44; యువరాజ్ (సి) నాయర్ (బి) మోరిస్ 27; మ్యాథ్యూస్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 184.
     
     వికెట్ల పతనం: 1-45; 2-93; 3-138.
     బౌలింగ్: సౌతీ 4-0-36-0; మోరిస్ 4-0-35-2; ధావల్ 1-0-18-0; తాంబే 3-0-18-1; హూడా 4-0-20-0; ఫాల్క్‌నర్ 4-0-55-0.
     
     రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) తాహిర్ 47; శామ్సన్ (సి) యువరాజ్ (బి) మ్యాథ్యూస్ 11; స్మిత్ (సి) మయాంక్ (బి) మిశ్రా 10; కరుణ్ నాయర్(స్టం) జాదవ్ (బి) మిశ్రా 20; బిన్నీ ఎల్బీడబ్ల్యూ (బి) తాహిర్ 1; దీపక్ హుడా (సి) మ్యాథ్యూస్ (బి) తాహిర్ 54; ఫాల్క్‌నర్ (బి) తాహిర్ 17; మోరిస్ నాటౌట్ 13; సౌతీ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186.
     
     వికెట్ల పతనం: 1-37; 2-50; 3-74; 4-78; 5-130; 6-166; 7-173.
     బౌలింగ్: ఉనాద్కట్ 3-0-30-0; కోల్టర్ 4-0-42-0; మ్యాథ్యూస్ 4-0-42-1; మిశ్రా 4-0-32-2; తాహిర్ 4-0-28-4; యువరాజ్ 1-0-11-0.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement