అదరగొట్టారు
⇒దీప్తి శర్మ, పూనమ్ రౌత్ సెంచరీలు
⇒తొలి వికెట్‌కు 320 పరుగులు
⇒జోడించిన భారత ఓపెనర్లు
⇒వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం
⇒ఐర్లాండ్‌పై 249 పరుగులతో ఘనవిజయం
పోట్‌చెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ పరుగుల బీభత్సం సృష్టించారు. వీరిద్దరి ఆటతీరుతో తొలుత సెంచరీలు, తర్వాత రికార్డులు దిగివచ్చాయి. దీంతో భారత మహిళల జట్టు 249 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ జట్టుపై జయకేతనాన్ని ఎగురవేసింది. నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో భారత అమ్మాయిలు గత రికార్డుల్ని బద్దలు కొట్టారు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు దీప్తి (160 బంతుల్లో 188; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), పూనమ్ (116 బంతుల్లో 109; 11 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. తొలి వికెట్‌కు 320 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం. దీప్తి 12 పరుగుల స్వల్ప తేడాతో అరుదైన డబుల్ సెంచరీ అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఐర్లాండ్ బౌలర్లను మాత్రం ముప్పుతిప్పలు పెట్టింది. ఐర్లాండ్ కెప్టెన్ లౌరా డిలనీ ఏడుగురు బౌలర్లను రంగంలోకి దింపినా భారత ఓపెనర్ల ధాటిని నిలువరించలేకపోయారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 40 ఓవర్లలో 109 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టంతా కలిసి పూనమ్ రౌత్ ఒక్కరే చేసిన స్కోరును చేయగలిగింది. ఓపెనర్ వాల్డ్‌రన్ చేసిన 35 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్. మిగతా వారిలో జెన్నిఫర్ గ్రే 26 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌ఉమెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4, శిఖా పాండే 3 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.
⇒దీప్తి, పూనమ్ తొలి వికెట్‌కు 320 పరుగులు జోడించారు. వన్డే క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. సారా టేలర్, కరోలైన్ అట్కిన్స్ (ఇంగ్లండ్) 2008లో లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాపై తొలి వికెట్‌కు జతచేసిన 268 పరుగుల భాగస్వామ్యం తెరమరుగైంది.
⇒పరుగుల పరంగా భారత్‌కిదే భారీ విజయం. పాక్‌పై 2008లో 207 పరుగుల తేడాతో నెగ్గడం ఇప్పటివరకు భారత్ బెస్ట్‌గా ఉంది.
⇒ భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌ఉమెన్‌గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. జయా శర్మ (138 నాటౌట్; పాక్‌పై 2005లో) పేరిట ఉన్న రికార్డును దీప్తి బద్దలు కొట్టింది.
⇒ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (27) కొట్టిన బ్యాట్స్‌ఉమెన్‌గా దీప్తి నిలిచింది.
⇒వన్డేల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు. 2004లో ధన్‌బాద్‌లో వెస్టిండీస్‌పై భారత్ చేసిన (298/2) పరుగులే ఇప్పటిదాకా అత్యధిక స్కోరుగా ఉంది.