రికార్డులని వాట్సాప్ చూశాకే తెలిసింది
దీప్తి, పూనమ్ వ్యాఖ్య
ముంబై: భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్‌లు తాము సాధించింది రికార్డులని వాట్సాప్ చూస్తేగానీ తెలుసుకోలేకపోయారు. అదికూడా రెండు గంటలు ఆలస్యంగా వారు తమ ప్రపంచ రికార్డు భాగస్వామ్యం గురించి తెలుసుకొని సంబరపడ్డారు. ‘నిజాయితీగా చెప్పాలంటే అది ఓ ప్రపంచ రికార్డు భాగస్వామ్యమని తెలియదు’ అని దీప్తి, పూనమ్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన వన్డేలో దీప్తి, పూనమ్‌లు తొలి వికెట్‌కు 320 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే మ్యాచ్ ముగిసి దాదాపు రెండు గంటలయ్యాక వీళ్లిద్దరు రిలాక్స్‌గా వాట్సాప్‌లోని భారత టీమ్ గ్రూప్‌ను చూశారు. అందులో ప్రశంసల మెసెజ్‌లు వరదలా వచ్చిపడ్డాయి. రికార్డు, ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు అభినందనలని అందులో పేర్కొన్నారు. దీంతో అప్పడుగానీ తమ భాగస్వామ్యం చరిత్ర లిఖించిందని తెలుసుకోలేకపోయారు.