యువీని వదిలేశారు
న్యూఢిల్లీ: గత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-8 సీజన్లో అత్యధిక ధర వెచ్చించి యువరాజ్ సింగ్ను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ .. రాబోవు ఐపీఎల్ సీజన్ కు మాత్రం వద్దనుకుంది. గురువారం ఐపీఎల్ ఆటగాళ్ల తొలి ట్రేడింగ్ విండోలో భాగంగా పలువురు ఆటగాళ్లకు ఆయా ప్రాంఛైజీలు ఉద్వాసన పలికాయి. యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ వదిలిస్తే.. వీరేంద్ర సెహ్వాగ్ ను కింగ్స్ ఎలివన్ పంజాబ్ తమ జాబితాను నుంచి తప్పించింది. మరోవైపు బౌలర్ ఇషాంత్ శర్మను సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసింది.
ఐపీఎల్-8 సీజన్ లో జీఎంఆర్ కు చెందిన ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 16 కోట్లు వెచ్చించి యువరాజ్ సింగ్ ను కొనుగోలు చేసింది. అయితే తమ బడ్జెట్ లో ఆర్థిక ఇబ్బందుల వల్ల స్టార్ ఆటగాడు యువీని వదులుకోవాల్సి వచ్చిందని డేర్ డెవిల్స్ సీఈవో హేమంత్ డుయా తెలియజేశారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే వేలంలో తమ ప్రాంఛైజీ రూ.36.85 కోట్లను మాత్రమే ఆటగాళ్ల కొనుగోలుకు వెచ్చించనున్నట్లు హేమంత్ పేర్కొన్నారు. గత ఐపీఎల్లో 14 మ్యాచ్ లు ఆడిన యువరాజ్ సింగ్ 19.07 సగటుతో 248 పరుగులు చేసి ఢిల్లీ ప్రాంఛైజీ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశాడు. కాగా ఈ మధ్య దేశవాళీ మ్యాచ్ ల్లో రాణించిన యువరాజ్.. దాదాపు రెండేళ్ల తరువాత టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో ఆసీస్ కు పయనమ్యే జట్టులో యువీకి ట్వంటీ 20 ల్లో స్థానం కల్పించి, వన్డేల్లో పక్కకు పెట్టారు.