
సమారా: తొలి మ్యాచ్‌లో పెరూపై అద్భుత విజయం సాధించిన డెన్మార్క్‌కు రెండో మ్యాచ్‌లో గట్టిపోటీ ఎదురైంది. గ్రూప్ ‘సి’లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో డెన్మార్క్ జోరుకు ఆస్ట్రేలియా కళ్లెం వేసింది. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో గోల్ సాధించడంతో చివరకు మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. డెన్మార్క్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎరిక్‌సన్ (7వ నిమిషంలో), ఆస్ట్రేలియా తరఫున మైల్ జెడినాక్ (38వ నిమిషంలో) గోల్స్ నమోదు చేశారు. తొలుత నికోలయ్ జార్గెన్‌సన్ అందించిన పాస్‌ను అందుకున్న ఎరిక్‌సన్... ఆసీస్ గోల్‌కీపర్ మాట్ ర్యాన్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. ఆ తర్వాత తేరుకున్న ఆసీస్ బంతిని ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకొని ఎటాకింగ్ గేమ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో 37వ నిమిషంలో డెన్మార్క్ ఆటగాడు యూసుఫ్ పౌల్సెన్ డి ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా బంతిని చేతితో తాకడంతో ప్రత్యర్థి ఆటగాళ్లు రిఫరీకి అప్పీలు చేశారు.
వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) సాంకేతికతను ఉపయోగించుకొని అప్పీలును పరిశీలించిన రిఫరీ యూసుఫ్ పౌల్సెన్‌కు ఎల్లో కార్డు ఇవ్వడంతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు పెనాల్టీ అవకాశం కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెప్టెన్ జెడినాక్ గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. అనంతరం ద్వితీయార్ధంలో ఇరు జట్లు గోల్ కోసం పోటా పోటీగా ప్రయత్నించాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా ఫినిషింగ్ లోపాలతో మరో గోల్ సాధ్యపడలేదు. మరో నిమిషంలో ఆట ముగుస్తుందనగా... ఆసీస్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు అర్జానీ కొట్టిన షాట్‌ను డెన్మార్క్ గోల్ కీపర్ షెమిచెల్ సమర్ధవంతంగా అడ్డుకోవడంతో చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న డెన్మార్క్ గ్రూప్‌లో రెండోస్థానంలో ఉంది. ఒక మ్యాచ్‌లో ఓడి ఓ మ్యాచ్ డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో మంగళవారం ఫ్రాన్స్‌తో డెన్మార్క్; పెరూతో ఆస్ట్రేలియా తలపడతాయి.