భారత ‘సి’ జట్టు కెప్టెన్ రహానేకు ట్రోఫీ అందజేస్తున్న బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా
న్యూఢిల్లీ: ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ను విజయం వరించింది. కెప్టెన్ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగారు. ఫలితంగా దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలిచి విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ‘సి’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. అనంతరం ఇషాన్ ఔటైనా... శుబ్‌మన్ గిల్ (26), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు)ల సాయంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రహానే జట్టుకు భారీ స్కోరు అందించాడు.
ప్రత్యర్థి బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్ 3, దీపక్ చహర్, మయాంక్ మార్కండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ‘బి’ జట్టు 46.1 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ‘బి’ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (14) త్వరగానే ఔటైనా... కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (60; 7 పోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం రుతురాజ్, హనుమ విహారి (8), మనోజ్ తివారి (4) వెంట వెంటనే ఔటయ్యారు. ఆ సమయంలో అంకుశ్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి శ్రేయస్ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. 60 బంతుల్లో 70 పరుగులు చేయాల్సిన దశలో అయ్యర్ క్రీజులో ఉండటంతో గెలుపు సునాయాసమే అనిపించినా... 43వ ఓవర్ చివరి బంతికి అయ్యర్ ఏడో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ ‘బి’ ఓటమి ఖాయమైంది. ‘సి’ జట్టు బౌలర్లలో పప్పు రాయ్ 3 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment