‘ఖేల్‌రత్న’మైన పారా అథ్లెట్‌ | Devendra Jhajharia envisioned Khel Ratna | Sakshi
Sakshi News home page

‘ఖేల్‌రత్న’మైన పారా అథ్లెట్‌

Published Fri, Aug 4 2017 12:14 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

‘ఖేల్‌రత్న’మైన పారా అథ్లెట్‌

‘ఖేల్‌రత్న’మైన పారా అథ్లెట్‌

జఝరియాకు అత్యున్నత క్రీడాపురస్కారం
సురేఖ, సాకేత్‌లకు ‘అర్జున’
జాబితాలో పుజారా, హర్మన్‌ప్రీత్‌
సిఫార్సు చేసిన అవార్డు కమిటీ


ఎట్టకేలకు ఓ పారా అథ్లెట్‌ అత్యున్నత క్రీడాపురస్కారానికి నామినేట్‌ అయ్యాడు. పాతికేళ్ల చరిత్ర వున్న ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు పారాలింపిక్స్‌ చాంపియన్, జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర జఝరియా అర్హత సంపాదించాడు. 13 ఏళ్ల క్రితమే ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో... గతేడాది రియోలో అతను భారత్‌కు పసిడి కాంతులు తెచ్చాడు. దశాబ్ద కాలానికిపైగా భారత హాకీకి సేవలందిస్తున్న సర్దార్‌ సింగ్‌ కూడా ‘ఖేల్‌రత్న’కు ఎంపికయ్యాడు.

న్యూఢిల్లీ: భారత పారా అథ్లెట్‌ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్‌ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌ను ఖేల్‌రత్న కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్‌ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు గెలుపొందాడు. దీంతో రిటైర్డ్‌ జస్టిస్‌ సీకే ఠక్కర్‌ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్‌ త్రోయర్‌ జఝరియాకు ఖేల్‌రత్నలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్‌ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్‌ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు.

మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్‌ కౌర్, టెస్టు క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారాలు ‘అర్జున’కు నామినేట్‌ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు. 36 ఏళ్ల దేవేంద్ర జఝరియా ఏథెన్స్‌ (2004), రియో (2016) పారాలింపిక్స్‌ క్రీడల్లో బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ఈ రెండు సార్లు అతను కొత్త రికార్డులు నెలకొల్పడం మరో విశేషం.

ఇన్నేళ్ల తర్వాతైన తను పడిన కష్టానికి తగిన మూల్యం దక్కుతున్నందుకు అతను హర్షం వ్యక్తం చేశాడు. క్రీడల్లో తనది సుదీర్ఘ ప్రయాణమని, ఇలాంటి పురస్కారంతో ప్రభుత్వం గుర్తించడం చాలా గర్వంగా ఉందన్నాడు. 31 ఏళ్ల స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ సర్దార్‌ సింగ్‌ ఓ ఆటగాడిగా, మాజీ సారథిగా భారత హాకీకి విశేష సేవలందించాడు. ఆసియా గేమ్స్‌లో జట్టుకు రెండు పతకాలు సాధించిపెట్టాడు. 2010 గ్వాంగ్‌జౌలో కాంస్యం, 2014 ఇంచియాన్‌లో భారత్‌ స్వర్ణం గెలిచింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండు రజతాలు గెలిచిన భారత జట్టు సభ్యుడు కూడా.

దీంతో 2015లో అతనికి ‘పద్మశ్రీ’ పౌర పురస్కారం లభించింది. సర్దార్‌ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల అరోపణలను అవార్డు కమిటీ చర్చించింది. అయితే సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనవిజయాలు అందించిన అతన్ని ఈ ఒక్క  కారణంతో అవార్డుకు దూరం పెట్టలేమని భావించింది. అర్జునకు నామినేట్‌ అయిన 29 ఏళ్ల పుజారా టెస్టుల్లో ‘ది వాల్‌’ ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేశాడు. ప్రస్తుతం లంకలో 50వ టెస్టు ఆడుతున్న ఈ స్టార్‌ క్రికెటర్‌ గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

కొంత కాలంగా భారత మహిళల క్రికెట్‌ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్మన్, ఇటీవల ప్రపంచకప్‌లో కూడా సత్తా చాటింది. మరో ఇద్దరు పారా అథ్లెట్లు మరియప్పన్‌ తంగవేలు (హైజంప్‌), వరుణ్‌ భటి (హైజంప్‌) అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఆశ్చర్యకరంగా సత్యవర్త్‌ కడియన్‌ను అర్జున కోసం నామినేట్‌ చేయడం క్రీడావర్గాలను విస్మయపరిచింది. ఒలింపిక్‌ మెడలిస్ట్‌ సాక్షి మలిక్‌ భర్త అయిన సత్యవర్త్‌ కెరీర్‌లో 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం మినహా చెప్పుకోదగ్గ ఘనతలేవీ లేవు.

‘నిజానికి నేను ఈ అవార్డును 12 ఏళ్ల క్రితం  అందుకోవాల్సింది. ఏథెన్స్‌లో స్వర్ణం గెలిచిన నాకు  ఈ అవార్డు అప్పుడే ఎందుకు రాలేదో ఇప్పటికీ అర్థం కాలేదు. ఏదేమైనా మొత్తానికి నా కష్టాన్ని గుర్తించారు. అత్యున్నత క్రీడాపురస్కారం కోసం నన్ను ఎంపిక చేసిన కమిటీకి, క్రీడాశాఖకు థ్యాంక్స్‌’
– దేవేంద్ర జఝరియా

టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తున్న సాకేత్‌ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియాతో కలిసి బంగారు పతకం, పురుషుల డబుల్స్‌లో సనమ్‌ సింగ్‌తో కలిసి రన్నరప్‌గా నిలిచి రజతం నెగ్గాడు. భారత డేవిస్‌ కప్‌ జట్టుకు రెగ్యులర్‌ ఆటగాడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

‘గత 15–20 ఏళ్లుగా హాకీనే ప్రాణంగా భావిస్తున్న నాకు ఇన్నాళ్లకు అత్యున్నత పురస్కారం దక్కనుండటం చాలా ఆనందంగా ఉంది. నా జట్టు సహచరుల వల్లే నాకు ఈ గౌరవం దక్కింది. ఈ క్రెడిట్‌ అంతా వాళ్లదే. వాళ్లే లేకుంటే నేనింతగా ఎదిగే వాణ్నే కాదు’        
– సర్దార్‌ సింగ్‌

జ్యోతి సురేఖ అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో  అద్భుతంగా రాణిస్తోంది. గతేడాది ఆసియా కప్‌ స్టేజ్‌–2 (తైపీ) టోర్నీలో టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, రజతం గెలిచింది. స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో వ్యక్తిగత రజతం, టీమ్‌ ఈవెంట్‌లో పసిడి పతకం నెగ్గింది. గత నెల ప్రపంచకప్‌ స్టేజ్‌–1 (చైనా), స్టేజ్‌–2 (అంటా ల్యా)లో నాలుగో స్థానంలో నిలిచింది.

అర్జున అవార్డు నామినీల జాబితా
జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), ఖుష్బీర్‌ కౌర్, అరోకిన్‌ రాజీవ్‌  (అథ్లెటిక్స్‌), ప్రశాంతి సింగ్‌ (బాస్కెట్‌బాల్‌), దేవేంద్రో సింగ్‌ (బాక్సింగ్‌), పుజారా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (క్రికెట్‌), ఓయినమ్‌ బెంబెం దేవి (ఫుట్‌బాల్‌), చౌరాసియా (గోల్ఫ్‌), ఎస్వీ సునీల్‌ (హాకీ), జస్వీర్‌సింగ్‌ (కబడ్డీ), ప్రకాశ్‌ (షూటింగ్‌), అమల్‌రాజ్‌ (టేబుల్‌ టెన్నిస్‌), మరియప్పన్‌ తంగవేలు, వరుణ్‌ భటి (పారా అథ్లెటిక్స్‌), సత్యవర్త్‌ కడియన్‌ (రెజ్లింగ్‌).

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement