rajiv khel ratna award
-
శరత్ కమల్‌కు ఖేల్‌రత్న.. శ్రీజ, నిఖత్‌లకు అర్జున
న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ ‘అర్జున’ విజేతలయ్యారు. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలతో సత్తా చాటుకుంటున్న తెలంగాణ మహిళా చాంపియన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా బాక్సర్ నిఖత్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శ్రీజలను ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీజ ‘మిక్స్డ్’ భాగస్వామి, స్టార్ టీటీ ప్లేయర్ అచంట శరత్ కమల్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ లభించింది. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు. కొన్నేళ్లుగా ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (204 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెల్చుకున్నాడు. మొత్తం 25 మంది క్రీడాకారులకు ‘అర్జున’ దక్కింది. ఇందులో నలుగురు పారాథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష క్రికెటర్ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డుకు జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మొహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమ షిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్)... ద్రోణాచార్య ‘లైఫ్ టైమ్’ అవార్డుకు దినేశ్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ఎంపికయ్యారు. అశ్విని అకుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ (హాకీ), సురేశ్ (కబడ్డీ), నీర్ బహదూర్ (పారాథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. తెలంగాణ స్టార్లకు... ఇంటాబయటా అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన ఆకుల శ్రీజ ఈ ఏడాది కెరీర్లోనే అత్యుత్తమ సాఫల్యాన్ని బర్మింగ్‌హామ్‌లో సాకారం చేసుకొంది. ఈ ఏడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వెటరన్ స్టార్ శరత్ కమల్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు నెగ్గింది. నిఖత్ ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో మెరిసింది. అవార్డీల జాబితా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్). అర్జున: నిఖత్ జరీన్, అమిత్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్), సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాశ్ సాబ్లే (అథ్లెటిక్స్), లక్ష్య సేన్, ప్రణయ్ (బ్యాడ్మింటన్), భక్తి కులకర్ణి, ప్రజ్ఞానంద (చెస్), దీప్గ్రేస్ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్), సాగర్ కైలాస్ (మల్లకంబ), ఇలవేనిల్ వలరివన్, ఓంప్రకాశ్ మిథర్వాల్ (షూటింగ్), వికాస్ ఠాకూర్ (వెయిట్‌లిఫ్టింగ్), అన్షు, సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మానసి జోషి, తరుణ్ థిల్లాన్, జెర్లిన్ అనిక (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్). -
'ఖేల్‌రత్న' రేసులో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌ల పేర్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) ప్రతిపాదించింది. అలాగే మరో ముగ్గురు షట్లర్ల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ జెర్రీ చోప్రా, సమీర్ వర్మలను అర్జున అవార్డు బరిలో నిలిపింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్ మురళీధరన్, పీయూ భాస్కర్ల పేర్లను కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. వీరిలో మురళీధరన్‌కు ఇప్పటికే ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే, 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్.. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వాలిఫై అయిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ విషయానికొస్తే.. ఈ స్టార్ షట్లర్ ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అతను టోక్యో బెర్తు కూడా సాధించలేకపోయాడు. కిదాంబి శ్రీకాంత్ చివరిసారిగా 2017లో నాలుగు టైటిల్స్ సాధించాడు. కాగా, ఈ అవార్డు కోసం క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, రవిచంద్రన్ అశ్విన్ నామినేట్ కాగా, ఆర్చరీలో వన్నెం జ్యోతి సురేఖ, ఫుట్‌బాల్‌లో సునీల్ ఛెత్రీ, టీటీలో శరత్ కమల్, జావలీన్ త్రోలో నీరజ్ చోప్రా తదితరులు నామినేట్ అయ్యారు. -
‘నేనే వెనక్కి తీసుకోమన్నాను’
న్యూఢిల్లీ: ‘రాజీవ్‌ఖేల్‌రత్న’ అవార్డు కోసం ఈ ఏడాది భారత సీనియర్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ పేరును ప్రతిపాదించిన పంజాబ్ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఉపసంహరించుకుంది. అయితే ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, వారు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని భజ్జీ వివరణ ఇచ్చాడు. ‘కొంత మంది ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సరిగానే పని చేసింది. ఖేల్‌రత్న నిబంధన ప్రకారం గత మూడేళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే నాకు అర్హత లేదు. అందుకే నేనే దరఖాస్తు వెనక్కి తీసుకోమని వారికి విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం దానికి అంగీకరించింది’ అని హర్భజన్ వెల్లడించాడు. అయితే భారత జట్టు తరఫున 2016 మార్చిలో చివరి మ్యాచ్ ఆడిన హర్భజన్ పేరును అసలు అర్హతే లేకుండా ఇప్పుడు ఎందుకు ప్రతిపాదించారనేదే ప్రాధమిక సందేహం. 40 ఏళ్ల హర్భజన్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు. -
ఖేల్‌రత్న బజరంగ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పూనియా అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా గేమ్స్ (జకార్తా), కామన్వెల్త్ గేమ్స్ (గోల్డ్‌కోస్ట్) చాంపియన్ అయిన పూనియాను 12 మంది సభ్యులు గల అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. రిటైర్డ్ జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో భారత క్రీడా దిగ్గజాలు బైచుంగ్ భూటియా, మేరీకోమ్ తదితరులున్నారు. ఈ కమిటీ రెండు రోజుల సమావేశం శుక్రవారం మొదలైంది. తొలిరోజే చాంపియన్ రెజ్లర్‌ను నామినేట్ చేయగా, శనివారం మరొకరిని ఈ ‘ఖేల్‌రత్న’కు జతచేసే అవకాశాల్ని కమిటీ పరిశీలిస్తుంది. గతేడాది అత్యున్నత క్రీడాపురస్కారానికి తనను గుర్తించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పూనియా కోర్టును కూడా ఆశ్రయించాడు. చివరకు మెగా ఈవెంట్లలో అతని బంగారు ప్రదర్శనను గుర్తించిన కమిటీ ఖేల్‌రత్నకు ఎంపిక చేయడం విశేషం. ఎట్టకేలకు తన ఘనతలకు గుర్తింపు దక్కినందుకు స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా హర్షం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు అవార్డుకు ఎంపిక కావడంకంటే కూడా తన శక్తి, సామర్థ్యాలే తనకు స్ఫూర్తి, ప్రేరణ అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అవార్డుల కమిటీ... అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన అథ్లెట్లు, కోచ్‌లను నేడు ఖరారు చేసి భారత ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. అనంతరం క్రీడాశాఖ అధికారికంగా జాబితాను విడుదల చేస్తుంది. దివంగత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డుల్ని అందజేస్తారు. -
‘ఖేల్‌రత్న’కు శ్రీజేశ్
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ పేరును... దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’కు నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది. మరోవైపు మిడ్‌ఫీల్డర్ చింగ్లెన్సనా సింగ్, ఫార్వర్డ్ ఆకాశ్ దీప్ సింగ్... మహిళా జట్టు డిఫెండర్ దీపిక పేర్లను ‘అర్జున అవార్డు’కు ప్రతిపాదించారు. ఆర్పీ సింగ్, సందీప్ కౌర్ పేర్లను జీవితసాఫల్య పురస్కారం ‘ధ్యాన్‌చంద్’ అవార్డుకు... బల్జీత్ సింగ్, బీఎస్ చౌహాన్, రమేశ్ పథానియా పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డులకు నామినేట్ చేశారు. 2006లో దక్షిణాసియా క్రీడల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన శ్రీజేశ్ ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్లకు శ్రీజేశ్ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. రెండు ప్రపంచకప్‌లలో, రెండు ఒలింపిక్స్‌లో కూడా అతను పాల్గొన్నాడు. -
‘ఖేల్‌రత్న’లకు ఆమోదముద్ర
న్యూఢిల్లీ: భారత హాకీ ఆటగాడు సర్దార్ సింగ్, పారాలింపియన్ దేవేంద్ర జజరియా ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు ఎంపిక అధికారికంగా ఖరారైంది. సెలక్షన్ కమిటీ కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి పేర్లను ప్రతిపాదించగా... కేంద్ర క్రీడా శాఖ మంగళవారం వీటికి ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ పురస్కారాల కోసం ప్రతిపాదించిన జాబితాను కూడా కేంద్రం ఆమోదించింది. హైదరాబాద్‌కు చెందిన హకీమ్ (ఫుట్‌బాల్) ధ్యాన్‌చంద్ అవార్డును, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగుల ప్రసాద్ (బ్యాడ్మింటన్) ద్రోణాచార్య (లైఫ్‌టైమ్) అవార్డును అందుకోనున్నారు. ‘అర్జున’ విజేతలకు జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా ‘అర్జున’ అవార్డులకు ఎంపికైన తెలుగు క్రీడాకారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. కమిటీ ప్రతిపాదించిన 17 మంది ఆటగాళ్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్)లకు ‘అర్జున’ అవార్డులు దక్కాయి. -
సర్దార్, దేవేంద్రలకు ‘ఖేల్‌రత్న’
- ముగ్గురికి ధ్యాన్‌చంద్, ఏడుగురికి ద్రోణాచార్య, 17 మందికి అర్జున పురస్కారాలు - అవార్డీలకు వైఎస్ జగన్ అభినందనలు న్యూఢిల్లీ:భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియాకు భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ దక్కింది. రియో పారా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా రెండు స్వర్ణాలు గెలుపొంది సత్తా చాటాడు. దాంతో ఖేల్ రత్న అవార్డుల సిఫారుసులో దేవెంద్ర తొలి ప్రాధాన్యత దక్కించుకున్నాడు. అయితే 25 ఏళ్ల చరిత్ర ఉన్న ఖేల్ రత్న అవార్డును ఓ పారాలింపియన్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు దశాబ్ద కాలానికిపైగా భారత హాకీకి సేవలందిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ కూడా ఖేల్ రత్న దక్కింది. ఈ మేరకు 2017 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం క్రీడా పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాలు పొందిన క్రీడాకారులందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇందులో క్రీడాపురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దాదాపు ఆమోదం తెలిపింది. దాంతో అర్జున అవార్డుకు సిఫారుసు చేసిన 17 మందికి ఆ అవార్డు లభించింది. అయితే ద్రోణాచార్య నామినీ నుంచి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న పారా స్పోర్ట్స్ కోచ్ సత్యనారాయణను తప్పించారు. రియో పారాలింపిక్స్ చాంపియన్, హైజంపర్ మరియప్పన్ తంగవేలు కోచ్ అయిన సత్యనారాయణ (కర్ణాటక) క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. దాంతో అతని పేరును తొలుత నామినేట్ చేసిన తరువాత తొలగించారు.దాంతో ఏడుగురికి మాత్రమే ద్రోణాచార్య దక్కింది. ఈ అవార్డులతో పాటు ధ్యాన్ చంద్ అవార్డు కోసం అథ్లెట్ భూపేందర్ సింగ్, సయ్యద్ షాహిద్ హకీం (ఫుట్‌బాల్), సుమరాయ్ టకే (హాకీ ) ఎంపికయ్యారు. ఈనెల 29న రాష్ట్రపతి భవన్లో వీరంతా అవార్డులు అందుకోనున్నారు. అర్జున అవార్డీలు: జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్ రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). ద్రోణాచార్య అవార్డీలు: డా.ఆర్ గాంధీ(అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా(కబడ్డీ), జీఎస్వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోషన్ లాల్(రెజ్లింగ్),రాఫెల్,(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్) ధ్యాన్‌చంద్ అవార్డీలు: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్),సయ్యద్ షాహీద్ హకీం (ఫుట్ బాల్),సుమరాయ్ టకే(హాకీ) -
‘ఖేల్‌రత్న’మైన పారా అథ్లెట్
►జఝరియాకు అత్యున్నత క్రీడాపురస్కారం ►సురేఖ, సాకేత్‌లకు ‘అర్జున’ ►జాబితాలో పుజారా, హర్మన్‌ప్రీత్ ► సిఫార్సు చేసిన అవార్డు కమిటీ ఎట్టకేలకు ఓ పారా అథ్లెట్ అత్యున్నత క్రీడాపురస్కారానికి నామినేట్ అయ్యాడు. పాతికేళ్ల చరిత్ర వున్న ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డుకు పారాలింపిక్స్ చాంపియన్, జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా అర్హత సంపాదించాడు. 13 ఏళ్ల క్రితమే ఏథెన్స్ ఒలింపిక్స్‌లో... గతేడాది రియోలో అతను భారత్‌కు పసిడి కాంతులు తెచ్చాడు. దశాబ్ద కాలానికిపైగా భారత హాకీకి సేవలందిస్తున్న సర్దార్ సింగ్ కూడా ‘ఖేల్‌రత్న’కు ఎంపికయ్యాడు. న్యూఢిల్లీ: భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను ఖేల్‌రత్న కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు గెలుపొందాడు. దీంతో రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్ త్రోయర్ జఝరియాకు ఖేల్రత్నలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు క్రికెటర్ చతేశ్వర్ పుజారాలు ‘అర్జున’కు నామినేట్ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు. 36 ఏళ్ల దేవేంద్ర జఝరియా ఏథెన్స్ (2004), రియో (2016) పారాలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ఈ రెండు సార్లు అతను కొత్త రికార్డులు నెలకొల్పడం మరో విశేషం. ఇన్నేళ్ల తర్వాతైన తను పడిన కష్టానికి తగిన మూల్యం దక్కుతున్నందుకు అతను హర్షం వ్యక్తం చేశాడు. క్రీడల్లో తనది సుదీర్ఘ ప్రయాణమని, ఇలాంటి పురస్కారంతో ప్రభుత్వం గుర్తించడం చాలా గర్వంగా ఉందన్నాడు. 31 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్ ఓ ఆటగాడిగా, మాజీ సారథిగా భారత హాకీకి విశేష సేవలందించాడు. ఆసియా గేమ్స్‌లో జట్టుకు రెండు పతకాలు సాధించిపెట్టాడు. 2010 గ్వాంగ్జౌలో కాంస్యం, 2014 ఇంచియాన్‌లో భారత్ స్వర్ణం గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజతాలు గెలిచిన భారత జట్టు సభ్యుడు కూడా. దీంతో 2015లో అతనికి ‘పద్మశ్రీ’ పౌర పురస్కారం లభించింది. సర్దార్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల అరోపణలను అవార్డు కమిటీ చర్చించింది. అయితే సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనవిజయాలు అందించిన అతన్ని ఈ ఒక్క కారణంతో అవార్డుకు దూరం పెట్టలేమని భావించింది. అర్జునకు నామినేట్ అయిన 29 ఏళ్ల పుజారా టెస్టుల్లో ‘ది వాల్’ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. ప్రస్తుతం లంకలో 50వ టెస్టు ఆడుతున్న ఈ స్టార్ క్రికెటర్ గత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కొంత కాలంగా భారత మహిళల క్రికెట్ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్మన్, ఇటీవల ప్రపంచకప్‌లో కూడా సత్తా చాటింది. మరో ఇద్దరు పారా అథ్లెట్లు మరియప్పన్ తంగవేలు (హైజంప్), వరుణ్ భటి (హైజంప్) అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఆశ్చర్యకరంగా సత్యవర్త్ కడియన్‌ను అర్జున కోసం నామినేట్ చేయడం క్రీడావర్గాలను విస్మయపరిచింది. ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మలిక్ భర్త అయిన సత్యవర్త్ కెరీర్లో 2014 కామన్వెల్త్ క్రీడల్లో రజతం మినహా చెప్పుకోదగ్గ ఘనతలేవీ లేవు. ⇒‘నిజానికి నేను ఈ అవార్డును 12 ఏళ్ల క్రితం అందుకోవాల్సింది. ఏథెన్స్లో స్వర్ణం గెలిచిన నాకు ఈ అవార్డు అప్పుడే ఎందుకు రాలేదో ఇప్పటికీ అర్థం కాలేదు. ఏదేమైనా మొత్తానికి నా కష్టాన్ని గుర్తించారు. అత్యున్నత క్రీడాపురస్కారం కోసం నన్ను ఎంపిక చేసిన కమిటీకి, క్రీడాశాఖకు థ్యాంక్స్’ – దేవేంద్ర జఝరియా ⇒టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తున్న సాకేత్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సానియాతో కలిసి బంగారు పతకం, పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్‌తో కలిసి రన్నరప్‌గా నిలిచి రజతం నెగ్గాడు. భారత డేవిస్ కప్ జట్టుకు రెగ్యులర్ ఆటగాడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ⇒ ‘గత 15–20 ఏళ్లుగా హాకీనే ప్రాణంగా భావిస్తున్న నాకు ఇన్నాళ్లకు అత్యున్నత పురస్కారం దక్కనుండటం చాలా ఆనందంగా ఉంది. నా జట్టు సహచరుల వల్లే నాకు ఈ గౌరవం దక్కింది. ఈ క్రెడిట్ అంతా వాళ్లదే. వాళ్లే లేకుంటే నేనింతగా ఎదిగే వాణ్నే కాదు’ – సర్దార్ సింగ్ జ్యోతి సురేఖ అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో అద్భుతంగా రాణిస్తోంది. గతేడాది ఆసియా కప్ స్టేజ్–2 (తైపీ) టోర్నీలో టీమ్ ఈవెంట్లో స్వర్ణం, రజతం గెలిచింది. స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో వ్యక్తిగత రజతం, టీమ్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గింది. గత నెల ప్రపంచకప్ స్టేజ్–1 (చైనా), స్టేజ్–2 (అంటా ల్యా)లో నాలుగో స్థానంలో నిలిచింది. అర్జున అవార్డు నామినీల జాబితా జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, అరోకిన్ రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్‌సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ (షూటింగ్), అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). -
సానియా మీర్జాకు ఖేల్ రత్న ?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. అయితే ఈ అంశంలో తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీ తీసుకుంటుందని వెల్లడించింది. కెరీర్లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. టెన్నిస్‌లో సానియా సాధించిన గొప్ప విజయాలకు గుర్తుగా క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమె పేరును సిఫారసు చేశారని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు. ‘ఏఐటీఏ నుంచి మాకు కాస్త ఆలస్యంగా సమాచారం అందింది. అయితే దీన్ని మంత్రి ఆమోదించి అవార్డుల కమిటీకి పంపిం చారు. ఇక తుది నిర్ణయం వాళ్లే తీసుకుంటారు’ అని శరణ్ పేర్కొన్నారు. అవార్డు విషయంలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ నుంచి సానియాకు గట్టిపోటీ ఎదురుకానుంది. ‘సానియా పేరును ఖేల్ రత్న కోసం ప్రతిపాదించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ స్ఫూర్తితో తను దేశానికి మరింత గౌరవం తెస్తుంది’ -సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఇప్పటి వరకు దేశంలో ఖేల్ రత్న అవార్డు అందుకున్న క్రీడాకారుల సంఖ్య 27. ఈ అవార్డును ప్రవేశపెట్టి 22 సంవత్సరాలయింది. -
‘పూనియా’కు అవార్డుపై తుది నిర్ణయం నేడు
న్యూఢిల్లీ: ప్రముఖ డిస్కస్ త్రోయర్ క్రిష్ణ పూనియా పేరును ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం ఎంపిక చేస్తారా? లేదా? అనే విషయం నేడు (మంగళవారం) తేలనుంది. కేంద్ర క్రీడా శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకోనుంది. అలాగే అర్జున అవార్డీల తుది జాబితా కూడా ఖరారు చేయనుంది. ఖేల్ రత్న కోసం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన పూనియా ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే లండన్ పారాలింపిక్స్‌లో రజతం సాధించిన హెచ్ఎన్ గిరీష పేరును ఖేల్ రత్న కోసం పరిగణనలోకి తీసుకోకపోతే అర్జున అవార్డు కోసం చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.