
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌ల పేర్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) ప్రతిపాదించింది. అలాగే మరో ముగ్గురు షట్లర్ల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ జెర్రీ చోప్రా, సమీర్ వర్మలను అర్జున అవార్డు బరిలో నిలిపింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్ మురళీధరన్, పీయూ భాస్కర్‌ల పేర్లను కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. వీరిలో మురళీధరన్‌కు ఇప్పటికే ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు.
ఇదిలా ఉంటే, 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్.. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వాలిఫై అయిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ విషయానికొస్తే.. ఈ స్టార్ షట్లర్ ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అతను టోక్యో బెర్తు కూడా సాధించలేకపోయాడు. కిదాంబి శ్రీకాంత్ చివరిసారిగా 2017లో నాలుగు టైటిల్స్ సాధించాడు. కాగా, ఈ అవార్డు కోసం క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, రవిచంద్రన్ అశ్విన్ నామినేట్ కాగా, ఆర్చరీలో వన్నెం జ్యోతి సురేఖ, ఫుట్‌బాల్‌లో సునీల్ ఛెత్రీ, టీటీలో శరత్ కమల్, జావలీన్ త్రోలో నీరజ్ చోప్రా తదితరులు నామినేట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment