సర్దార్, దేవేంద్రలకు ‘ఖేల్రత్న’
- ముగ్గురికి ధ్యాన్‌చంద్, ఏడుగురికి ద్రోణాచార్య, 17 మందికి అర్జున పురస్కారాలు
- అవార్డీలకు వైఎస్ జగన్ అభినందనలు
న్యూఢిల్లీ:భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియాకు భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ దక్కింది. రియో పారా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా రెండు స్వర్ణాలు గెలుపొంది సత్తా చాటాడు. దాంతో ఖేల్ రత్న అవార్డుల సిఫారుసులో దేవెంద్ర తొలి ప్రాధాన్యత దక్కించుకున్నాడు. అయితే 25 ఏళ్ల చరిత్ర ఉన్న ఖేల్ రత్న అవార్డును ఓ పారాలింపియన్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు దశాబ్ద కాలానికిపైగా భారత హాకీకి సేవలందిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ కూడా ఖేల్ రత్న దక్కింది. ఈ మేరకు 2017 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం క్రీడా పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాలు పొందిన క్రీడాకారులందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
ఇందులో క్రీడాపురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దాదాపు ఆమోదం తెలిపింది. దాంతో అర్జున అవార్డుకు సిఫారుసు చేసిన 17 మందికి ఆ అవార్డు లభించింది. అయితే ద్రోణాచార్య నామినీ నుంచి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న పారా స్పోర్ట్స్ కోచ్ సత్యనారాయణను తప్పించారు. రియో పారాలింపిక్స్ చాంపియన్, హైజంపర్ మరియప్పన్ తంగవేలు కోచ్ అయిన సత్యనారాయణ (కర్ణాటక) క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. దాంతో అతని పేరును తొలుత నామినేట్ చేసిన తరువాత తొలగించారు.దాంతో ఏడుగురికి మాత్రమే ద్రోణాచార్య దక్కింది. ఈ అవార్డులతో పాటు ధ్యాన్ చంద్ అవార్డు కోసం అథ్లెట్ భూపేందర్ సింగ్, సయ్యద్ షాహిద్ హకీం (ఫుట్‌బాల్), సుమరాయ్ టకే (హాకీ ) ఎంపికయ్యారు. ఈనెల 29న రాష్ట్రపతి భవన్‌లో వీరంతా అవార్డులు అందుకోనున్నారు.
అర్జున అవార్డీలు: జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్ రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్).
ద్రోణాచార్య అవార్డీలు: డా.ఆర్ గాంధీ(అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా(కబడ్డీ), జీఎస్వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోషన్ లాల్(రెజ్లింగ్),రాఫెల్,(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్)
ధ్యాన్చంద్ అవార్డీలు: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్),సయ్యద్ షాహీద్ హకీం (ఫుట్ బాల్),సుమరాయ్ టకే(హాకీ)