
పుల్‌షాట్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని
ముంబై: ప్రత్యర్థి అయితేనేమి ఎన్నో ఏళ్లుగా దేశానికి అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్‌ను అందించాడనేమో.. వాంఖడే మైదానంలోని ప్రేక్షకులు మహేంద్ర సింగ్ ధోనీకి అద్భుత స్వాగతం పలికారు. చెన్నై, ముంబై జట్ల మధ్య బుధవారం వాంఖడే మైదానంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరున్న ధోని.. ఐపీఎల్‌లో చెన్నై కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బుధవారం బ్యాటింగ్ చేసేందుకు గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు.. ప్రత్యర్థి ఆటగాడని కూడా మర్చిపోయి ముంబై అభిమానులు చప్పట్లు, కేకలు, విజిళ్లతో ధోనీకి స్వాగతం పలికారు. చెన్నై ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం, రైనా కొద్దిసేపటికే వెనుదిరగడంతో ధోని త్వరగానే బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. డ్రెస్సింగ్ రూం నుంచి ధోని బ్యాట్ అందుకుని మైదానంలోకి వస్తుంటే వాంఖడేలోని ప్రేక్షకులు ధోని.. ధోని.. అంటూ, చిరకాలంగా ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ విజయాన్ని (ఏప్రిల్ 2, 2011) తమకు అందించిన మాజీ భారత సారథికి జేజేలు పలికారు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో 37 పరుగుల తేడాతో ఓడిపోయిన చెన్నై.. తన తర్వాతి మ్యాచ్‌లో అశ్విన్ సారథ్యంలోని పంజాబ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment