
రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ బయోపిక్!
ముంబై: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్లో రూ.66 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తొలిరోజు 21.30 కోట్ల రూపాయలు రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వసూలు చేసింది.
ఆదివారం కూడా భారీ కలెక్షన్లు ఉండటంతో మొత్తంగా రూ.66 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ పేర్కొన్నారు. దాంతో 2016లో చిత్ర ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచినట్లు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ ట్వీట్ చేశారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'సుల్తాన్' అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. 'ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ' సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, సుషాంత్ సింగ్ రాజ్ పుట్ టైటిల్ రోల్ ను పోషించాడు.