
సినిమా సెట్ కు ఎంఎస్ ధోని..
ముంబై: భారతీయ చలన చిత్ర సీమలో క్రీడాకారుల జీవిత కథల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు క్రీడాకారులు జీవిత గాథలు సినిమాలుగా వచ్చి భారీ సక్సెస్ రేట్ ను అందుకున్నాయి. ఈ కోణంలో రూపొందుతున్న మరో చిత్రమే 'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ'. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కాగా, తన జీవిత చరిత్రను తెరపైకి ఎక్కించే విధానాన్ని ఒకసారి స్వయంగా చూసుకోవాలని భావించిన ధోని.. ఆ సినిమా సెట్ కు వెళ్లి సందడి చేశాడు.
ఆ సినిమాలో ఆన్ స్క్రీన్ ధోని పాత్ర పోషిస్తున్నహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , కెమెరామెన్ లారాతో కలిసి ఫోటో దిగాడు. ఈ విషయాన్నిఆ చిత్రంలో ధోని తండ్రి పాత్ర చేస్తున్నప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తమ సినిమా సెట్ కు ధోని రావడంతో మొత్తం యూనిట్ చాలా సంతోషంగా ఉందని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది.