ధోనీ ప్రణాళికలు సరిగా లేవు: గవాస్కర్
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ఘోరంగా వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా ధోనీ సేన పూర్తిగా విఫలం కావడంతో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. అసలు ఈ టోర్నీలో ధోనీ ప్రణాళికలను సరిగా అమలు చేయడంలో వైఫల్యం చెందాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ ప్రణాళికలు చాలా నాసిరకంగా ఉండటమే కాకుండా.. వాటిలో కుదింపు స్పష్టంగా కనబడిందన్నాడు.
రానున్నది ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడినట్లు లేదన్నాడు.టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన బౌలింగ్ లో ఆకట్టుకున్నా.. ధోనీ అతన్ని సరిగా వినియోగించుకోలేదని మండిపడ్డాడు. ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు తీసిన ఆటగాడిరి పూర్తి కోట ఇవ్వకుండా ఉండటం ధోనీ చేసిన తప్పుగా గవాస్కర్ తెలిపాడు. తానొక ఆశావాదినని.. టీమిండియా ఓటమి పాలుకావడం తనను తీవ్రంగా కలచి వేసిందని మాజీ లెజెండ్ ఆటగాడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా స్టువర్ట్ బిన్నీ మంచి ఆటగాడైనా.. ఆస్ట్రేలియాలో ఆ యువ ఆటగాడు షాట్ల ఎంపిక సరిగా లేదన్నాడు. ఆస్ట్రేలియాలో స్టేడియాలు పెద్దవి అన్న సంగతిని బిన్నీ మరచినట్టున్నాడని గవాస్కర్ పాఠాలు చెప్పాడు. ఆస్ట్రేలియాలో కట్ అండ్ పుల్ షాట్లు ఆడితే బాగుండేదని హితవు పలికాడు.