టీమిండియా అవుట్: ఫైనల్లో ఇంగ్లండ్
పెర్త్: ఊహించినట్టుగానే టీమిండియా ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలిగింది. టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని టీమిండియా కు వరల్డ్ కప్ ముందు మంచి ఎదురుదెబ్బ తగిలింది. ముక్కోణపు సిరీస్ లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్ తో జరిగిన కీలకమైన ఆఖరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా బోక్కా బోర్లా పడి టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 201పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ ముందుంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆదిలో కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనించింది. 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను జేమ్స్ టేలర్(82), బట్లర్(67 )లు ఆదుకున్నారు.
ఒత్తిడిని జయంచి చివరి వరకూ క్రీజ్ లో నిలబడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంగ్లండ్ కు మరపురాని విజయాన్ని అందించారు.190 పరుగుల వద్ద జేమ్స్ టేలర్, 193 పరుగుల వద్ద బట్లర్ లు పెవిలియన్ కు చేరినా.. అప్పటికే ఇంగ్లండ్ విజయం ఖాయం కావడంతో చివరి వరుస ఆటగాళ్ల ఆ పనిని పూర్తి చేశారు.. మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో తుదిపోరుకు సన్నద్ధమైంది. టీమిండియా బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి మూడు వికెట్లు లభించగా, మోహిత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఒక్క విజయాన్ని కూడా చేజిక్కించుకోలేక పోవడం గమనార్హం. ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు ఘోరంగా వైఫల్యం చెందడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. రానున్న ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతున్న టీమిండియా ఇదే తరహా ఆటను ప్రదర్శిస్తే ఆదిలోనే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఈ సిరీస్ ను ఒక గుణపాఠంగా భావించి టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.