దినేశ్‌ కార్తీక్‌ సూపర్‌ హిట్‌ | India win tri-series after Dinesh Karthik blitz in tense final | Sakshi
Sakshi News home page

దినేశ్‌ కార్తీక్‌ సూపర్‌ హిట్‌

Published Mon, Mar 19 2018 12:49 AM | Last Updated on Mon, Mar 19 2018 7:19 AM

India win tri-series after Dinesh Karthik blitz in tense final - Sakshi

ఇది అలాంటి ఇలాంటి ఉత్కంఠ కాదు. తనువును ఉన్నచోటే బంధించింది. కళ్లను రెప్పలు కొట్టకుండా కట్టేసింది. గుండె దడను అమాంతం పెంచేసింది. నిజం... ఆ ఉత్కంఠకు నరాలు కాదు ఉక్కు తీగలే తెగుతాయేమో?భారత్‌ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్‌ లేడు. కేవలం జిడ్డుగా, పరుగులకు అడ్డుగా ఉన్న విజయ్‌ శంకరే ఉన్నాడు. దినేశ్‌ కార్తీక్‌ అప్పుడే వచ్చాడు. అది 19వ ఓవర్‌! ఇక గెలుపు ఆశలే లేవు. టి20ల్లో ఏనాడూ బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోని భారత్‌... ఇపుడు ఏకంగా కప్‌నే కోల్పోవాల్సిన పరిస్థితి. కానీ దినేశ్‌ దడదడలాడించాడు. రూబెల్‌ హొస్సేన్‌ వేసిన ఆ ఓవర్లో జూలు విదిల్చాడు. 6, 4, 6, 0, 2, 4 అంతే! భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులైంది. సౌమ్య సర్కార్‌ చేతిలో బంతి. ఇక ఈజీలే అనుకుంటే విజయ్‌ శంకర్‌ బంతులు మింగే పనిలో ఉన్నాడు. తొలి బంతికి వైడ్‌తో పరుగొచ్చింది. 0, 1, 1, ఎట్టకేలకు 4వ బంతికి ఫోర్‌ కొట్టి ఐదో బంతికి ఔటయ్యాడు. ఇక మిగిలింది ఒక్కటే బంతి! గెలిచేందుకు 5 పరుగులు.క్రీజులో దినేశ్‌ కార్తీక్‌... ఉత్కంఠ ఎవరెస్టంతా. అందరిలోనూ టెన్షన్‌... టెన్షన్‌... కార్తీక్‌ ఒక్కడే అటెన్షన్‌. సౌమ్య సర్కార్‌ బంతి వేశాడు. అందరూ కళ్లప్పగించి చూస్తుండగా కార్తీక్‌ బ్యాట్‌ నుంచి ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా ఫ్లాట్‌ షాట్‌. ఫోరేమోననే బెంగ... కానీ అది సిక్సర్‌. భారతే విన్నర్‌.

కొలంబో: దినేశ్‌ కార్తీక్‌ 29 నాటౌట్‌. లెక్కకు స్కోరు తక్కువే! కానీ 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో మ్యాచ్‌నే మలుపు తిప్పే ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత్‌కు ఒంటిచేత్తో నిదహస్‌ ట్రోఫీని అందించాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షబ్బీర్‌ రహమాన్‌ (50 బంతుల్లో 77; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. యజువేంద్ర చహల్‌ 3, ఉనాద్కట్‌ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (42 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. రూబెల్‌ హొస్సేన్‌కు 2 వికెట్లు దక్కాయి. దినేశ్‌ కార్తీక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... వాషింగ్టన్‌ సుందర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒక మార్పు చేసింది. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ స్థానంలో ఉనాద్కట్‌ను బరిలోకి దించింది. 

స్పిన్‌తో విలవిల... 
టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (11; 1 సిక్స్‌)ను సుందర్‌ ఔట్‌ చేయగా, ఆ మరుసటి ఓవర్లోనే చహల్‌ దెబ్బమీద దెబ్బ తీశాడు. మరో ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (15; 1 ఫోర్‌)తో పాటు సౌమ్య సర్కార్‌ (1)నూ పెవిలియన్‌ చేర్చాడు. తమీమ్‌ భారీ సిక్సర్‌కు ప్రయత్నించగా, లాంగాన్‌లో ఫీల్డర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ బౌండరీ లైన్‌ వద్ద తనను తాను నియంత్రించుకుంటూ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. దీంతో 27 పరుగుల వద్దే బంగ్లా రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్‌ స్వీప్‌షాట్‌ ఆడగా... స్క్వేర్‌ లెగ్‌లో శిఖర్‌ ధావన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. 33 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన బంగ్లాను షబ్బీర్‌ రహమాన్, ముష్ఫికర్‌ రహీమ్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ చహల్‌ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. గూగ్లీతో ముష్ఫికర్‌ (9) ఆట కట్టించాడు. అతని క్యాచ్‌ను విజయ్‌ శంకర్‌ డైవ్‌ చేసి పట్టడంతో బంగ్లా 68 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.  

ఆదుకున్న షబ్బీర్‌... 
అనంతరం షబ్బీర్‌కు మహ్ముదుల్లా జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో బంగ్లాదేశ్‌ 14వ ఓవర్‌ చివరి బంతికి 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఇన్నింగ్స్‌ కుదుటపడిందనుకున్న ఈ దశలో సమన్వయలేమితో మహ్ముదుల్లా (16 బంతుల్లో 21; 2 ఫోర్లు) రనౌటయ్యాడు. లేని పరుగుకు ప్రయత్నించిన షబ్బీర్‌... మహ్ముదుల్లాను బలిచేశాడు. తర్వాత వచ్చిన షకీబుల్‌ హసన్‌ అండతో షబ్బీర్‌ 37 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. విజయ్‌ శంకర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో షబ్బీర్‌ 2 భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అదే ఓవర్‌ ఐదో బంతికి షకీబుల్‌ (7) కూడా రనౌటయ్యాడు. డెత్‌ ఓవర్లలో స్కోరు పెంచేందుకు సిద్ధమవుతున్న షబ్బీర్‌ను 19వ ఓవర్లో ఉనాద్కట్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మరుసటి బంతికి రూబెల్‌ హొస్సేన్‌ (0) కూడా బౌల్డయ్యాడు. శార్దుల్‌ వేసిన చివరి ఓవర్లో మెహదీ హసన్‌ మిరాజ్‌ 2 ఫోర్లు, 1 సిక్స్‌తో మొత్తం 18 పరుగులు సాధించాడు. 



స్పిన్‌కు పేస్‌ జతకాలేదు... 
స్పిన్నర్లు చహల్‌ (3/18), సుందర్‌ (1/20) పవర్‌ ప్లేలో బంగ్లా (40/3)ను కట్టడి చేశారు. వీరి శ్రమకు పేసర్లు జతయితే బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేది. కానీ విజయ్‌ శంకర్‌ (0/48), శార్దుల్‌ ఠాకూర్‌ (0/45) ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో బంగ్లాదేశ్‌ పోరాడే లక్ష్యాన్నే భారత్‌ ముందుంచింది. 

తడబడింది... 
లక్ష్యఛేదనకు దిగిన భారత ఇన్నింగ్స్‌ ధాటిగా ప్రారంభమైంది. రెండో ఓవర్లో కెప్టెన్‌ రోహిత్‌ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లలోనే 24 పరుగులు చేయగా... ఆ తర్వాతి వరుస ఓవర్లలో ధావన్‌ (10), రైనా (0)లు నిష్క్రమించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ తడబడింది. ఈ దశలో రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ముందుగా రాహుల్‌తో కలిసి రన్‌రేట్‌ తగ్గకుండా లక్ష్యం దిశగా నడిపించాడు. బ్యాట్‌కు అందిన బంతిని భారీ సిక్సర్లుగా, అదుపు తప్పిన బంతిని బౌండరీగా మలుస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 51 పరుగులు జోడించాక జట్టు స్కోరు 83 పరుగుల వద్ద రాహుల్‌... రూబెల్‌ హొస్సేన్‌ బౌలింగ్‌లో షబ్బీర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో మనీశ్‌ పాండే క్రీజ్‌లోకి రాగా... రోహిత్‌ 35 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  అంతర్జాతీయ టి20ల్లో అతనికిది 14వ అర్ధ సెంచరీకాగా కొద్దిసేపటికే నాలుగో వికెట్‌గా నిష్క్రమించాడు. నజ్ముల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ మహ్ముదుల్లా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు.  
బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌గా వచ్చిన విజయ్‌ శంకర్‌ భారత ఇన్నింగ్స్‌కు గుదిబండగా మారాడు. పాండే (27 బంతు ల్లో 28; 3 ఫోర్లు) వేగంగా పరుగులు చేస్తుంటే... మరోవైపు విజయ్‌ (19 బంతుల్లో 17; 3 ఫోర్లు) అదేపనిగా బంతుల్ని వృథా చేశాడు. దీంతో సమీకరణం మారింది. 15 ఓవర్లు ముగిసే సరికి 30 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా, 18 బంతుల్లో 35కు పెరిగింది. 18వ ఓవర్‌ వేసిన ముస్తఫిజుర్‌ కేవలం పరుగు మాత్రమే ఇచ్చి పాండే వికెట్‌ తీశాడు. ఇక భారత్‌ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు చేయాలి. ఈ దశలో వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ అసాధారణ ఆటతీరుతో భారత్‌ను గెలిపించాడు.

►టి20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌కిది వరుసగా ఎనిమిదో విజయం. 
►టి20 మ్యాచ్‌ల్లో చివరి బంతికి విజయానికి 5 పరుగులు అవసరం కాగా... సిక్స్‌ కొట్టి గెలిపించిన తొలి బ్యాట్స్‌మన్‌ కార్తీక్‌. 
►అంతర్జాతీయ టోర్నమెంట్‌ ఫైనల్లో చివరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన  రెండో క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌. ఇంతకుముందు 1986లో షార్జాలో జరిగిన ఆస్ట్రేలేసియా కప్‌ ఫైనల్లో భారత్‌పై చివరి ఓవర్‌ చివరి బంతికి మియాందాద్‌ సిక్స్‌ కొట్టి పాక్‌ను గెలిపించాడు.  
►ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో జట్టును గెలిపించిన ఐదో క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌. గతంలో కపుగెడెర (శ్రీలంక; భారత్‌పై 2010లో),  మోర్గాన్‌ (ఇంగ్లండ్‌; భారత్‌పై 2012లో), బాబర్‌ (పాకిస్తాన్‌; విండీస్‌పై 2013లో), సిబండ (జింబాబ్వే; నెదర్లాండ్స్‌పై 2014లో) ఇలా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement