న్యూఢిల్లీ: ఏ ఫీల్డ్‌లోనైనా నిలదొక్కుకోవాలంటే అందుకోసం విశేషమైన కృషి అవసరమనే విషయం మనకు తెలుసు. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కోసం మిక్కిలి శ్రమించాలి. ఇలా ఒక సాధారణ ఆటగాడిగా ప్రపంచ క్రికెట్‌కు పరిచయమైన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఇప్పుడు క్రికెట్‌నే శాసిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకు కీలకంగా మారిపోయాడు కోహ్లి. అప్పట్లో సచిన్ టెండూల్కర్ ఎంతటి క్రేజ్ సంపాదించాడో దాదాపు అదే స్థాయిలో రాటుదేలాడు కోహ్లి. ఇప్పటివరకూ కోహ్లి సాధించిన రికార్డులను చూస్తే అతని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కోహ్లికి కూడా చేదు అనుభవం ఎదురైన సందర్భం ఉంది. అది కూడా ఎంఎస్ ధోని కెప్టెన్సీలోనేనట.2008లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన కోహ్లిని ధోని వద్దన్నాడట. (కోహ్లి జట్టులో ఉంటాడు.. కానీ ధోనినే సారథి)
ఆ సమయంలో అండర్-19 వరల్డ్‌కప్‌ను సాధించిపెట్టిన కోహ్లిని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయడానికి ధోని ససేమిరా వద్దన్నాడని అప్పటి చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగసర్కార్ తెలిపాడు. కాకపోతే తనతో పాటు సెలక్షన్ కమిటీ అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని పట్టుబట్టడంతో కోహ్లి జట్టులోకి రావడానికి మార్గం సుగుమం అయ్యిందని వెంగసర్కార్ పేర్కొన్నాడు. కోహ్లిని ఎంపిక చేయడానికి అప్పటి బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ కూడా ముందుగా ఒప్పుకోలేదని, తామంతా తప్పనిసరిగా అవకాశం ఇచ్చి చూడాలని అనడంతో కోహ్లి జాతీయ జట్టులోకి వచ్చాడన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment