వికెట్ పడిందంటూ ఎంపైర్ వేలెత్తడమే ఆలస్యం.. ఇమ్రాన్ తాహిర్ సంబరాల్లో మునిగిపోతాడు. చేతులు విశాలంగా చాచి.. అభిమానుల గ్యాలరీ వైపు పరిగెత్తుతూ.. ఛాతి బాదుకుంటూ.. కొన్నిసార్లు సింహంలా గర్జిస్తూ.. అతను ఆకాశమే హద్దుగా ఆనంద డొలికల్లో తేలిపోతాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న 40 ఏళ్ల వెటరన్ సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ తాహిర్ ఎనర్జీ ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తోంది. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యే వయస్సులో చక్కని బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టడంలోనే కాదు.. మైదానమంతా హల్‌చల్ చేస్తూ సంబరాల్లో మునిగిపోవడంలోనూ అతను తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
చెన్నై అభిమానులు ‘పరాశక్తి ఎక్స్‌ప్రెస్’ అని ముద్దుగా పిలుచుకునే తాహిర్ హోమ్‌గ్రౌండ్‌లో జరిగిన తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఢిల్లీని చిత్తుచేయడంతో.. సూపర్‌కింగ్స్ 80 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు పడగొట్టిన తాహిర్.. వికెట్ పడిన ప్రతిసారి చెప్పాక్ స్టేడియంలో అభిమానుల వద్దకు పరిగెత్తి.. సింహంలా గర్జిస్తూ సంబరాలు జరిపాడు. మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా తాహిర్ ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్స్ ధోనీ చాలా ఒకింత ఫన్నీగాస్పందించాడు. ‘తాహిర్ సెలబ్రేషన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, వికెట్ తీయగానే అతనికి దగ్గరికి వెళ్లకూడదని నాకు, వాట్సన్ చాలా బాగా తెలుసు. ఎందుకంటే వికెట్ పడగానే మరోవైపునకు అతను పరిగెత్తుకు వెళుతాడు. ఇది నాకు, వాట్సన్‌కు కొంత కష్టమే. మేం 100శాతం ఫిట్‌గా లేనప్పుడు అలా పరిగెత్తి అభినందించడం కూడా కొంచెం కష్టమే. అందుకే అతను సంబరాలు ముగించుకొని.. వెనక్కి వచ్చాక.. అతని దగ్గరికి వెళ్లి బాగా బౌలింగ్ చేశావని అభినందిస్తాం. మళ్లీ మా ఫీల్డింగ్ పొజిషన్‌కి వచ్చేస్తాం’ అని ధోనీ సరదాగా వివరించాడు. చెన్నై లీడింగ్ వికెట్ టేకర్ అయిన తాహిర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను రెండోస్థానంలో ఉండగా.. ఢిల్లీ బౌలర్ రబడ 25 వికెట్లతో ఆగ్రస్థానంలోఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment