
భారతరత్నకు సచిన్ అర్హుడే
నోయిడా: ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం అందుకునే అర్హత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఉందని అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువతకు అతడు మార్గదర్శకుడని కొనియాడారు. ఓ క్రికెటర్‌గా విజయవంతమవడమే కాకుండా తన ప్రవర్తనతో కూడా తోటి ఆటగాళ్లకన్నా ముందున్నాడన్నారు. అయితే తనకన్నా ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు ఈ ఘనత దక్కితే బాగుండేదని అన్నారు. పలు అంశాలపై మిల్కా అభిప్రాయలు ఆయన మాటల్లోనే...
సచిన్ వినయం అపూర్వం: చాన్నాళ్లుగా సచిన్ ఆదర్శప్రాయుడిగా ఉంటున్నాడు. చాలాసార్లు నేను అతడిని కలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా నా పాదాలకు నమస్కరిస్తాడు. ముందు ధ్యాన్‌చంద్‌కు ఇవ్వాల్సింది: సచిన్‌కు భారతరత్న ఇవ్వడంలో నాకెలాంటి వ్యతిరేకత లేదు. అయితే ముందుగా ఈ అవార్డును దశాబ్దాల క్రితమే అంతర్జాతీయ క్రీడాలోకంలో భారత పతాకాన్ని ఎగిరేలా చేసిన హాకీ వీరుడు ధ్యాన్‌చంద్‌కు ఇస్తే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికైనా ఈ అవార్డు ఆయనకు దక్కాలి. మొత్తానికి ఆటగాళ్లకు ‘భారతరత్న’ ద్వారాలు తెరుచుకోవడం సంతోషకరం.
క్రీడాకారులను గవర్నర్లుగా నియమించాలి: దేశంలో చాలామంది క్రీడాకారులకు మంచి విజ్ఞానం ఉంది. వారిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా లేక రాయబారులుగా నియమించాలి.
మీడియాకు క్రికెట్ అంటేనే మోజు: క్రికెట్ గురించి మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తుంటుంది. అయితే మా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లు, ఐఓఏ కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆటగాళ్ల గురించి క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.