
సచిన్‌ను క్రీడా మంత్రిని చేయాలి: మిల్కా సింగ్
పణజి: భారత్‌లో క్రీడలు మరింతగా అభివృద్ధి చెందాలంటే మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను క్రీడా మంత్రిగా చేయాలని అథ్లెటిక్స్ దిగ్గజం మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. ‘సచిన్ క్రీడా మంత్రిగా వ్యవహరిస్తే ఈ దేశంలో ఆటల అభివృద్ధికి తోడ్పడతాడు. ఓ ఆటగాడైతే నే చిత్తశుద్ధితో పనిచేసే వీలుంటుంది’ అని మిల్కా అన్నారు. అలాగే క్రీడాకారుల్లో భారతరత్న అవార్డు దక్కేందుకు అందరికన్నా ధ్యాన్‌చంద్‌కే ఎక్కువ అర్హత ఉందన్నారు. మరోవైపు రాజకీయ నాయకులు, ధనవంతులు భారత క్రీడా సంఘాలను తమ గుప్పిట్లో పెట్టుకుని తీరని హాని చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అందుకే దేశం క్రీడల్లో ముందడుగు వేయడం లేదని ఆవేదన చెందారు. భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారని, మీడియా తన ధోరణిని మార్చుకోవాలని సూచించారు. చైనా తరహాలో క్రీడలను ప్రోత్సహించాలని మిల్కా అన్నారు.