నొయిడా:దేశంలో చాలామంది క్రీడాకారులకు మంచి విజ్ఞానం ఉంది. వారిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా లేక రాయబారులుగా నియమించాలి. రాజకీయ నాయకులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఈ పదవులకు ఎంపిక అవుతున్నప్పుడు ఆటగాళ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ ప్రశ్నించాడు ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం అందుకునే అర్హత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఉందని తెలిపాడు. దేశంలోని యువతకు అతడు మార్గదర్శకుడని కొనియాడారు. ఓ క్రికెటర్‌గా విజయవంతమవడమే కాకుండా తన ప్రవర్తనతో కూడా తోటి ఆటగాళ్లకన్నా ముందున్నాడన్నారు.
అయితే తనకన్నా ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు ఈ ఘనత దక్కితే బాగుండేదని అన్నారు. మొత్తానికి ఈ అవార్డును క్రీడాకారులకు కూడా ఇవ్వనుండడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. సచిన్ వినయం అపూర్వం: చాన్నాళ్లుగా సచిన్ ఆదర్శప్రాయుడిగా ఉంటున్నాడు. చాలాసార్లు నేను అతడిని కలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా నా పాదాలకు నమస్కరిస్తాడు. అతడి ప్రవర్తనకు ముగ్ధుడయ్యే వాడిని. క్రికెటర్‌గా ఎంతో పేరున్నా చాలా అణుకువగా ఉంటాడు. తన విజయాలను నెత్తికెక్కించుకోని ఆటగాడని మిల్కాసింగ్ తెలిపాడు.