అద్వానీ... అదరహో
15వసారి ప్రపంచ టైటిల్ సొంతం
స్నూకర్ చాంపియన్‌షిప్‌లో విజేత
ఫైనల్లో చైనా ప్లేయర్‌పై జయభేరి
హర్గాడ (ఈజిప్టు): ‘క్యూ స్పోర్ట్స్’లో తనకు తిరుగులేదని భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ మరోసారి నిరూపించాడు. నమ్మశక్యంకాని రీతిలో ఏకంగా 15వసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం ముగిసిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఈ బెంగళూరు ఆటగాడు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ సమరంలో 30 ఏళ్ల పంకజ్ అద్వానీ 8-6 ఫ్రేమ్‌ల (117-6, 75-16, 29-68, 63-23, 87-1, 16-72, 110-13, 113- 1, 52-65, 13-84, 77-36, 14-126, 26-82, 116-24) తేడాతో 18 ఏళ్ల జావో జిన్‌టాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. ప్రపం చ స్నూకర్ టైటిల్ నెగ్గడం అద్వానీకిది రెండోసారి. 2003లో తొలిసారి అతను ఈ ఘనత సాధించాడు.
జిన్‌టాంగ్‌తో జరిగిన ఫైనల్లో ఆరంభం నుంచే అద్వానీ తన సత్తా చాటుకున్నాడు. ఏకాగ్రతతో ఆడుతూ గురి తప్పకుండా నిలకడగా స్కోరు చేశాడు. 15 ఫ్రేమ్‌ల ఫైనల్ రెండు సెషన్‌లపాటు జరిగింది. తొలి సెషన్‌లో ఏడు, రెండో సెషన్‌లో ఎనిమిది ఫ్రేమ్‌లను నిర్వహించారు. తొలి సెషన్ పూర్తయ్యాక అద్వానీ 5-2తో ఆధిక్యంలో ఉన్నాడు. రెండో సెషన్ మొదలయ్యాక ఎనిమిదో ఫ్రేమ్‌ను అద్వానీ దక్కించుకొని విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత జిన్‌టాంగ్ నుంచి గట్టిపోటీ ఎదురైనా అద్వానీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
ఇప్పటివరకు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్ బిలియర్డ్స్‌లో ఏడుసార్లు (2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005)... పాయింట్ ఫార్మాట్ బిలియర్డ్స్‌లో మూడుసార్లు (2014, 2008, 2005) సిక్స్ రెడ్ స్నూకర్‌లో రెండుసార్లు (2015, 2014), ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ పోటీల్లో (2014) ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.