కొలంబో : శ్రీలకతో జరిగిన మ్యాచ్‌లో నోబాల్ వివాదం, ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు, అంపైర్లతో వాగ్వాదం ఘటనలపై బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భిన్నంగా స్పందించారు. మైదానం నుంచి తమ బ్యాట్స్‌మన్లను వచ్చేయమనలేదని, అంపైర్లు పొరపాటు చేశారు కాబట్టే మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘(ఉదాన వేసిన) 20వ ఓవర్‌లో తొలి బంతి.. ముస్తాఫిజుర్ భుజం కంటే ఎత్తులో వెళ్లడంతో స్క్వేర్ లెగ్ అంపైర్ ‘నో బాల్’ ప్రకటించారు. కానీ మరుక్షణంలోనే మెయిన్ అంపైర్‌తో మాట్లాడి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండో బంతి కూడా అంతే ఎత్తులో బౌన్సైంది. కానీ అంపైర్లు నోబాల్ ఇవ్వలేదు. ఆటలో పొరపాట్లు సహజం. ఆ పొరపాటు గురించే అంపైర్లతో మాట్లాడానుగానీ మరో ఉద్దేశమేదీ లేదు.
ఇకపోతే, మా బ్యాట్స్‌మన్లను బయటికి వచ్చేయమని నేను అననేలేదు. నా సైగలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేనేం చెప్పానో మీకు(మీడియాకు) ఎలా తెలుస్తుంది? జరిగిందేదో జరిగిపోయింది, ప్రస్తుతం మా గురి భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌పైనే..’’ అని షకీబ్ అన్నారు.
అవును.. కొంచెం అతి చేశాం : లంకతో జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల భావోద్వేగాలు శృతిమించాయన్నది వాస్తవమేనని బంగ్లా సారధి అంగీకరించారు. ‘‘గీత దాటి ప్రవర్తించానా? అని నాక్కూడా అనిపించింది. నన్ను నేను తమాయించుకోవడం అవసరమనిపించింది. సరే, ఏదేమైనా ఆటలో ఇలాంటి ఉద్వేగాలు సహజమే’ అని ముగించాడు షకీబ్.
డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం : ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment