'హ్యాట్రిక్ చేశానని అప్పుడు తెలియదు'
రాంచీ: భారత్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న లంక ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించాడు. భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి లంక బౌలర్ గా నిలిచాడు. అయితే, హ్యాట్రిక్ వికెట్లు తీసిన విషయమే తనకు తెలియలేదని పెరీరా చెప్పాడు. తాను కేవలం వికెట్లు తీయడం, పరుగులు కట్టడం చేయడంపైనే దృష్టిసారించడంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదని వివరించాడు. 19వ ఓవర్ వేసిన పెరీరా తొలుత కొన్ని బంతులను వైడ్లు వేశాడు. ఆ ఓవర్ నాల్గో బంతికి పాండ్యాను అవుట్ చేసిన పెరీరా, ఆ తరువాత ఐదు, ఆరు బంతులకు రైనా, యువరాజ్ లను పెవిలియన్ బాట పట్టించాడు. యువరాజ్ డకౌట్(0) గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ లో పెరీరా 3 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు.
ఓవరాల్ గా తనకు ఇది రెండో హ్యాట్రిక్ అని, గతంలో పాక్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో తొలిసారి ఈ ఫీట్ సాధించినట్లు పెరీరా చెప్పాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని తమ జట్టు ముందే డిసైడ్ అయినట్లు వివరించాడు. టీమిండియా బ్యాటింగ్ ఒక్క కారణం వల్లే తమ జట్టు ఓటమి పాలైందని లంక బౌలర్ అభిప్రాయపడ్డాడు. ధావన్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు.. అశ్విన్ తన బౌలింగ్ తో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టాడని రెండో టీ20 ఓటమి తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలు చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా టీ 20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాల్గో ఆటగాడిగా పెరీరా గుర్తింపు పొందాడు. అంతకుముందు బ్రెట్ లీ, జాకబ్ ఓరమ్, టీమ్ సౌతీలు హ్యాట్రిక్ లు ఈ ఫీట్ నెలకొల్పారు.