అర్జెంటీనా సాకర్ దిగ్గజం డీగో మారడోనా రెండోసారి భారత పర్యటనకు రానున్నారు. వచ్చే సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఆయన
కోల్‌కతా: అర్జెంటీనా సాకర్ దిగ్గజం డీగో మారడోనా రెండోసారి భారత పర్యటనకు రానున్నారు. వచ్చే సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఆయన కోల్‌కతాలో సందడి చేయనున్నారు. ఫుట్‌బాల్ కార్నివాల్ ప్రారంభోత్సవం కోసం భారత్‌కు రానున్న ఆయన... ఇక్కడున్న రెండు రోజుల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కలిసి మారడోనా ఓ చారిటీ మ్యాచ్‌లో తలపడతారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయనను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది.
దాదాపు పదేళ్ల తర్వాత కోల్‌కతాకు రానుండటం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని 56 ఏళ్ల మారడోనా అన్నారు. ‘కోల్‌కతాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. గత పర్యటనలో నాకు చాలా మధురానుభూతులు ఉన్నాయి. భారత్‌లో ఫుట్‌బాల్‌కు లభించే ఆదరణ అపూర్వం. పదేళ్ల తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లనుండటం నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది’ అని మారడోనా అన్నారు.