
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi: ప్రపంచకప్ గెలవాలన్న చిరకాల కల నెరవేర్చుకునే దిశగా దూసుకెళ్తున్నాడు మేటి ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ. కెరీర్‌లో ఇంతవరకు అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగుదూరంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా ఖతర్ వేదికగా క్రొయేషియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో మెస్సీ బృందం ఘన విజయం సాధించింది. ఫైనల్ చేరాలన్న క్రొయేషియా ఆశలపై నీళ్లు చల్లుతూ 3-0తో చిత్తు చేసింది.
తద్వారా 2014 తర్వాత తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గోల్‌తో మెరిశాడు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ. క్రొయేషియాతో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కిక్‌కు గోల్‌గా మలిచిన ఈ స్టార్ ఫుట్‌బాలర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ప్రపంచకప్ టోర్నీలో అతడికి ఇది ఐదో గోల్. మొత్తంగా ఈ మెగా ఈవెంట్‌లో 11వది. తద్వారా అర్జెంటీనా తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దిగ్గజ ఫుట్‌బాలర్ డిగో మారడోనా సహా గాబ్రియెల్ బటిస్టుటా, గిల్మెరో స్టబిలేను దాటుకుని అగ్రస్థానంలో నిలిచాడు.
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్లు
లియోనల్ మెస్సీ- 11(25 మ్యాచ్‌లు)
గాబ్రియెల్ బటిస్టుటా- 10(12 మ్యాచ్‌లు)
గిల్మెరో స్టబిలే- 8 (4 మ్యాచ్‌లు)
డిగో మారడోనా- 8 (21 మ్యాచ్‌లు)
మారియో కెంప్స్- 6 (18 మ్యాచ్‌లు)
తనే మొదటివాడు
ఇక ఈ రికార్డుతో మరో ఫీట్‌ను కూడా నమోదు చేశాడు మెస్సీ. ఒక వరల్డ్‌కప్ టోర్నీలో 5 గోల్స్ సాధించిన అత్యధిక వయస్కుడిగా నిలిచాడు 35 ఏళ్ల మెస్సీ.