'ధోనీతో పోలిక వద్దు.. నా మనస్తత్వం వేరు'
ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనను పోల్చరాదని యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాక, భారత జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్గా తొలి పర్యటనకు సిద్ధమయ్యాడు. టి20, వన్డే ఫార్మాట్లకు ధోనీ కెప్టెన్గా కొనసాగుతుండగా, టెస్టు జట్టుకు కోహ్లీని సారథిగా నియమించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ పర్యటనలో భారత టెస్టు జట్టుకు విరాట్ సారథ్యం వహించనున్నాడు.
ఈ సందర్భంగా కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు, ధోనీకి మధ్య చాలా వ్యత్యాసాలున్నాయని చెప్పాడు. 'ధోనీకి, నాకు మధ్య ఎందుకు పోలిక తెస్తారు? నాది విభిన్నమైన మనస్తత్వం' అని ఓ ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ అన్నాడు. కాగా కెప్టెన్గా ధోనీ నుంచి చాలా విషయాలు నెర్చుకున్నానని చెప్పాడు. మహీ మిస్టర్ కూల్గా ప్రశంసలు అందుకోగా, కోహ్లీ దూకుడైన మనస్తత్వంతో కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. కోహ్లీ ఈ విషయంపై స్పందిస్తూ తన స్వభావాన్ని మార్చుకోనని చెప్పాడు. టెస్టు క్రికెట్లో భారత కెప్టెన్గా ధోనీ ఎన్నో ఘనవిజయాలు సాధించాడని, వాటి కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించడం చాలా కష్టమని కోహ్లీ అంగీకరించాడు. ధోనీ హయంలో దిగ్గజ ఆటగాళ్లయిన సీనియర్లు జట్టులో ఉండేవారని, ప్రస్తుతం యువ ఆటగాళ్ల మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరముందని చెప్పాడు.