అంత వీజీ కాదు! | 'Don't see any change in momentum' - Kohli | Sakshi
Sakshi News home page

అంత వీజీ కాదు!

Published Thu, Nov 19 2015 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

అంత వీజీ కాదు!

అంత వీజీ కాదు!

బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావాలి... మీరేం చేస్తారో మాకు తెలీదు. తొలి రోజు నుంచే బంతి తిరగాలి... మ్యాచ్‌లకు ముందు క్యూరేటర్లకు వచ్చే ఆదేశాలివి. నిజానికి అప్పటికప్పుడు పిచ్ స్వభావాన్ని మార్చడం సాధ్యం కాదు. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లకు పిచ్‌లు రూపొందించడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. ఇటీవల పిచ్‌ల గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు టెస్టు మ్యాచ్‌లకు పిచ్‌లు ఎలా తయారు చేస్తారో చూద్దాం.
 
సాక్షి క్రీడావిభాగం: టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడమనేది ఏ రాష్ట్ర సంఘానికైనా చాలా గర్వంగా ఉంటుంది. ఓ మంచి టెస్టు పిచ్‌ను రూపొందిస్తే క్యూరేటర్‌కు అంతకుమించిన సంతృప్తి మరోటి ఉండదు. ఐదు రోజుల ఫార్మాట్‌కు వికెట్‌ను తయారు చేయడం ఓ కల... అలాగే సవాలు కూడా. ప్రతి క్యూరేటర్ దీన్ని కోరుకుంటాడు.
 
* సీజన్‌లో ఎక్కువ క్రికెట్ ఆడటం వల్ల పిచ్ తయారీలో కూ డా విస్తృతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో పిచ్ తయారీకి 20 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు 10 రోజుల్లోనే మంచి వికెట్‌ను రూపొందిస్తున్నారు.
 
* సాధారణంగా టెస్టు మ్యాచ్ కోసం మూడు సెంటర్ వికెట్లను ఎంపిక చేస్తారు. ఒక దానిపై ఎలాంటి గడ్డి లేకుండా ఉంటుంది. మ్యాచ్‌కు ఓ వారం ముందు వీటిపై పని మొదలవుతుంది. మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌ను ఎంపిక చేసిన తర్వాత 10ఁ80 అడుగుల రోప్‌ను దాని చుట్టూ కడతారు.
 
* తర్వాత వికెట్‌పై ఉండే గడ్డి ఎత్తును కొలుస్తారు. ఇది ఎనిమిది అంగుళాల కంటే ఎక్కువగా ఉండకూడదు. మ్యాచ్ సమయానికి దీన్ని తగ్గిస్తారు. పిచ్‌పై నీళ్లు చల్లడం సాధారణంగా కనిపించినా... నీటిని నేరుగా పోయరు. షవర్ పైపుతో పిచికారి చేస్తారు. పిచ్‌పై ప్రతి చిన్న ప్రదేశం తడిసేలా చేస్తూ అన్ని వైపులా సమాంతరంగా పడేలా చూస్తారు.
 
* వికెట్ ఉపరితలం మరీ మృదువుగా ఉంటే భూమిలోకి నీరు చాలా తొందరగా ఇంకిపోతుం ది. దీన్ని తెలుసుకునేందుకు 3 నుంచి 4 మిల్లీ మీటర్ల మందంతో ఆరు అంగుళాల పొడవున్న స్క్రూ డ్రైవర్‌ను నిటారుగా పిచ్‌పై దించి దీన్ని అంచనా వేస్తారు. నీళ్లు నాలుగు అంగుళాల కంటే కిందకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా లోపలికి ఇంకితే మంచి పిచ్‌ను రూపొందించలేరు. పిచ్ ఉపరితలంపై ఎక్కువ తడి ఉంటే బౌలర్లు సరైన బౌన్స్‌ను రాబట్టలేరు. అలాగే పిచ్ సాంద్రత నాలుగు రోజుల పాటు ఉండదు.
     
* ఉదయం పూట పిచ్‌పై నీళ్లు చల్లడం అయ్యాక.. 250 నుంచి 350 కేజీల బరువున్న రోలర్‌తో తేలికగా ఒక మూల నుంచి మరో మూలకు 20 నిమిషాల పాటు రోలింగ్ చేస్తారు. షవర్ పద్ధతిని ఉపయోగించి క్రమం తప్పకుండా పిచ్‌పై నీళ్లను చల్లుతూ రోలింగ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఉపరితలంపై ఉండే మట్టి, ఇసుక అటూ ఇటూ పోకుండా ఉంటాయి.
     
* పిచ్‌పై నీళ్లు పిచికారి చేసిన తర్వాత ఆరడానికి కాస్త సమయం ఇవ్వాలి. అప్పుడు ఉపరితలంపై ఏ మేరకు నీళ్లు ఉన్నాయో పరిశీలించి మళ్లీ తేలికగా రోలింగ్ చేయాలి. అవసరమైతే నీటిని పిచికారి చేయాలి. ప్రతి రోజూ మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలి. ఆ తర్వాత పిచ్‌పై కవర్లు తీసేసి తేమ లేకుండా చూడాలి.  
      
* మధ్యాహ్నం ఎండకు వెంట్రుక మందంలో పిచ్‌పై పగుళ్లు వస్తాయి. తర్వాత టన్ను బరువున్న రోలర్‌ను రోలింగ్ చేయడం ద్వారా పిచ్ మరింత బాగా కుదురుకుంటుంది.
 
* ఉదయం పూట రోలింగ్ చేయడం వల్ల పిచ్ రెండు అంగుళాలు కుదించుకున్నట్లు కనిపిస్తుంది. సాయంత్రం కూడా ఒకసారి రోలిం గ్ చేయాలి. ఇలా వరుసగా మూడు రోజులు చేయడం వల్ల పిచ్ బాగా శక్తిని పుంజుకుంటుంది. నాలుగో రోజు పిచ్‌పై వదిలేసిన 8 అంగుళాల గడ్డిని ఆరు అంగుళాలకు కత్తిరిస్తారు. మధ్యాహ్నం మరో రెండు అంగుళాల మేర తగ్గిస్తారు. ఇప్పుడు వికెట్‌పై సరైన ఎత్తులో గడ్డి ఉండటం వల్ల పిచ్‌పై ఫలితం వచ్చే అవకాశాలుంటాయి.
      
* పిచ్‌పై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ గతంలో మైదానంలో మ్యాచ్‌లు జరగకపోతే... వికెట్ సంపీడ్యతను అంచనా వేసేందుకు కనీసం కొంతైనా క్రికెట్‌ను అడించాలి. ఇక ఉపయోగించుకునేందుకు పిచ్ సిద్ధంగా ఉన్నప్పుడు ఉపరితలం ఎక్కువగా పొడిబారకుండా, గడ్డి సమానంగా వ్యాపించి ఉండేలా మైదానం సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు.
      
* పిచ్‌ను రూపొందించేటప్పుడు సూర్యకాంతి, ఉష్ణోగ్రత, మ్యాచ్ సమయాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే వాతావరణంలో మార్పులను కూడా  దృష్టిలో పెట్టుకొని అంచనాలు వేసుకుంటారు. సాధారణంగా నవంబర్‌లో మ్యాచ్ ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. అదే మార్చిలో చాలా పొడిగా ఉంటుంది. శీతాకాలంలో రెండు రోజులు మాత్రమే పిచ్ పొడిగా ఉంటుంది. అదే ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రత వల్ల ఉపరితలంపై పెద్ద పెద్ద పగుళ్లు వస్తాయి.
 
* ఏదైనా పిచ్ మనం కోరుకున్నట్లు ఉండాలంటే సంబంధిత క్యూరేటర్‌కు కనీసం 10 రోజుల ముందు సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement