అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు(PC: ACB)
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్‌లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.
హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలు
ఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేశాడు.
‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లు
ఓవరాల్‌గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది.
మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.
అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలా
ఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్‌లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.
కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్‌లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.
జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)
👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్
👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586
👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699
👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4
👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).
చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి!
Comments
Please login to add a commentAdd a comment