'భారత క్రికెట్ కోచ్ గా అతనే సరైనోడు'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ కోచ్ పదవిని చేపట్టడానికి మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడే సరైన వ్యక్తి అని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీమిండియా కోచ్ పదవిని ద్రవిడ్తో భర్తీ చేస్తే జట్టుకు కచ్చితంగా లాభిస్తుందని వాట్సన్ తెలిపాడు.
' రాహుల్ ద్రవిడ్ నాణ్యమైన క్రికెటర్. అందులో ఎటువంటి సందేహం లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సమ్మతి మేరకు కోచ్ పదవిని ద్రవిడ్ చేపడితే బాగుంటుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్కు ద్రవిడ్ కెప్టెన్ గా చేసినప్పుడు అతనితో నేను కలిసి పనిచేయకపోవడం నిజంగా దురదృష్టం. ఆ తరువాత మెంటర్(సలహాదారు) గా ద్రవిడ్ పని చేసినప్పుడు అతని వద్ద నుంచి కొన్ని మెళుకువలు నేర్చుకున్నాను. అప్పుడే ద్రవిడ్ గురించి నాకు పూర్తిగా తెలిసింది 'అని వాట్సన్ పేర్కొన్నాడు. ఒకవేళ ద్రవిడ్ భారత క్రికెట్ కోచ్ పదవి పగ్గాలు చేపడితే అద్భుతంగా పని చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతనిలో ఉన్న విశేషమైన అనుభవం కచ్చితంగా యువ క్రికెటర్లకు ఉపయోగపడుతుందని వాట్సన్ స్పష్టం చేశాడు.