ఐసీసీ తీరు ఆశ్చర్యకరం
నా పట్ల కఠినంగా వ్యవహరించారు
భారత్, ఆసీస్ డీఆర్‌ఎస్ వివాదంపై డు ప్లెసిస్
డ్యునెడిన్: భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం తీవ్రస్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డు ప్లెసిస్ తెలిపాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ తన అవుట్‌పై రివ్యూ కోరేందుకు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం... భారత కెప్టెన్ కోహ్లి జోక్యంతో అంపైర్ అతడిని వెంటనే వెళ్లమనడం జరిగింది. ఆసీస్ మోసపూరితంగా ఆడుతోందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆరోపించాడు. అయితే తాను కావాలని అలా చూడలేదని, ఆ సమయంలో తన మైండ్ సరిగ్గా పనిచేయలేదని మ్యాచ్ అనంతరం స్మిత్ చెప్పాడు. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రం తాను బాల్ టాంపరింగ్ చేశానని ఐసీసీ కఠినంగా వ్యవహరించిందని డు ప్లెసిస్ గుర్తుచేశాడు.
‘నిజంగా ఐసీసీ తీరు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ విషయంతో పోలిస్తే ఆసీస్ పర్యటనలో నాపై వచ్చిన ఆరోపణలు చాలా చిన్నవి. అయినా నాపై సీరియస్‌గా చర్యలు తీసుకున్నారు. ఈసారి కూడా ఐసీసీ అలాగే స్పందిస్తుందని అనుకున్నాను. కానీ ఐసీసీ మాత్రం ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. నేనేమీ వివాదం సృష్టించాలనుకోవడం లేదు. భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లు ఆడినప్పుడు ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఈసారి మాత్రం నేను అక్కడ లేకపోవడం మంచిదైంది’ అని డు ప్లెసిస్ ఎద్దేవా చేశాడు. గతేడాది నవంబర్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో బంతి మెరుపు కోసం ఉద్దేశపూర్వకంగా నోటిలో ఉన్న మింట్ తీసి రుద్దినట్టు డు ప్లెసిస్‌పై వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించింది.