లక్నో: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా అథ్లెట్ ద్యుతీచంద్ ఆకట్టుకుంది. శుక్రవారం జరిగిన 100మీ. పరుగులో ద్యుతీచంద్ విజేతగా నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పరుగును అందరికన్నా వేగంగా 11.38 సెకన్లలో పూర్తిచేసి ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 100మీ. హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి విజేతగా నిలిచింది. ఆమె 13.91సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. హెప్టాథ్లాన్ ఈవెంట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ 5321 పాయింట్లతో పసిడి పతకాన్ని అందుకుంది.
అనస్ తప్పిదం... జట్టుపై అనర్హత వేటు
పురుషుల 4–400మీ. రిలేలో భారత అథ్లెట్ మొహమ్మద్ అనస్ తప్పిదంతో ఏఎఫ్‌ఐ ‘బి’ జట్టుపై అనర్హత వేటు పడింది. ఏఎఫ్‌ఐ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అనస్... 400మీ. రిలే ఫైనల్లో ‘బి’ జట్టు ఆటగాడి వద్ద నుంచి బ్యాటన్ అందుకొని పరుగెత్తాడు. దీంతో ‘బి’ జట్టు అనర్హత పాలైంది. నిజానికి అనస్‌కు బ్యాటన్ అందించాల్సిన అతని ‘ఎ’ జట్టు సహచరుడు అలెక్స్ ఆంథోని థర్డ్ లెగ్ రేసు మధ్యలో కండరాల గాయంతో వైదొలిగాడు. ఫైనల్ లెగ్‌లో బ్యాటన్ కోసం వేచిచూస్తోన్న అనస్ అదే సమయానికి థర్డ్ లెగ్‌ను పూర్తిచేసిన ‘బి’ జట్టు ఆటగాడు సాజన్ నుంచి బ్యాటన్ తీసుకొని పరుగు పెట్టాడు. దీంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment