భారీస్కోరు దిశగా దక్షిణాఫ్రికా
ఎల్గర్ సెంచరీ
వెస్టిండీస్‌తో రెండో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: ఓపెనర్ డీన్ ఎల్గర్ (239 బంతుల్లో 121; 18 ఫోర్లు) సెంచరీ సహాయంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (228 బంతుల్లో 99 బ్యాటింగ్; 12 ఫోర్లు; 2 సిక్సర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. క్రీజులో తనకు జతగా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (17 బ్యాటింగ్) ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 47 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది.
ఓపెనర్ పీటర్సన్ మరోసారి పేలవ ఆటతీరుతో పెవిలియన్‌కు చేరగా... ఎల్గర్ జట్టుకు అండగా నిలబడ్డాడు. డు ప్లెసిస్‌తో కలిసి విండీస్ బౌలర్లను ఆడుకున్నాడు. దీనికి తోడు ప్రత్యర్థి ఫీల్డింగ్ లోపాలను ఈ జోడీ సొమ్ము చేసుకుంది. డు ప్లెసిస్ 8, 26 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అటు ఎల్గర్ కూడా 48, 73 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 179 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జత చే శారు. 208 బంతుల్లో ఎల్గర్ కెరీర్‌లో మూడో సెంచరీ సాధించాడు. పీటర్స్, గాబ్రియెల్‌లకు చెరో వికెట్ దక్కింది.