Ind Vs SL ఆడుతూ పాడుతూ... భారత్ ఘనవిజయం
కొలంబో: పేరుకు ద్వితీయ శ్రేణి జట్టయినా ఊహించినట్టుగానే భారత జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది.
చమిక కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ దసున్ షనక (50 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్ష్యఛేదనలో భారత్ 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయ అర్ధ సెంచరీ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్)తో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ‘బర్త్‌డే బాయ్’ వన్డేల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) మెరుపులు మెరిపించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. అవిష్క ఫెర్నాండో (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), మినోద్ భానుక (44 బంతుల్లో 27; 3 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 10వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన చహల్ భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. దాంతో 49 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్‌ను కోల్పోయింది. స్పిన్నర్ల రాకతో శ్రీలంక స్కోరు బోర్డు వేగం మందగించింది. ఒకదశలో 205/7గా నిలిచిన శ్రీలంక 250 మార్కును దాటడం కష్టంగా అనిపించింది. అయితే 8వ స్థానంలో వచ్చిన కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరు అందించాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక 32 పరుగులు రాబట్టింది.
పృథ్వీ... ధావన్... మధ్యలో ఇషాన్
ఛేదనలో భారత ఇన్నింగ్స్ మూడు దశలుగా సాగింది. పృథ్వీ షా మెరుపు ఆరంభాన్నిస్తే... చివర్లో ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ ‘బర్త్‌డే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. చమీర వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన పృథ్వీ... ఆ తర్వాతి ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు బాదాడు. ఇక ఉదాన వేసిన నాలుగో ఓవర్లో మరింత రెచ్చిపోయిన అతను కవర్స్ దిశగా హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. దాంతో భారత స్కోరు 4.5 ఓవర్లలో 50 పరుగుల మార్కును దాటింది.
మరో ఎండ్‌లో ఉన్న ధావన్ మాత్రం సింగిల్స్‌కే ప్రాధాన్య ఇస్తూ పృథ్వీకే ఎక్కువగా స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన పృథ్వీ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ఇషాన్... తాను ఎదుర్కొన్న తొలి బంతినే లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. పృథ్వీ ఇన్నింగ్స్‌కు కొనసాగింపుగా ఇషాన్ బ్యాటింగ్ సాగింది. ధనంజయ వేసిన 8వ ఓవర్లో ఇషాన్ ‘హ్యాట్రిక్’ ఫోర్స్ కొట్టాడు. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 91/1గా నిలిచింది. హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చిన ఇషాన్ 33 బంతుల్లో తొలి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు.
ఆ కాసేపటికే సందకన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. ధావన్, ఇషాన్ రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ధావన్... ఇప్పుడు నా వంతు అంటూ తన బ్యాట్‌కు పని చెప్పాడు. కరుణరత్నే బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధావన్... ఆ తర్వాతి ఓవర్లో సింగిల్ తీసి 61 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మనీశ్ పాండే (26; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. పాండే అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి) పాండే (బి) చహల్ 32; మినోద్ భానుక (సి) పృథ్వీ షా (బి) కుల్దీప్ యాదవ్ 27; రాజపక్స (సి) ధావన్ (బి) కుల్దీప్ యాదవ్ 24; ధనంజయ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ పాండ్యా 14; అసలంక (సి) ఇషాన్ కిషన్ (బి) దీపక్ చహర్ 38; షనక (సి) హార్దిక్ (బి) చహల్ 39; హసరంగ (సి) ధావన్ (బి) దీపక్ చహర్ 8; కరుణరత్నే (నాటౌట్) 43; ఉదాన (సి) దీపక్ చహర్ (బి) హార్దిక్ 8; చమీర (రనౌట్) 13; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 262.
వికెట్ల పతనం: 1–49, 2–85, 3–89, 4–117, 5–166, 6–186, 7–205, 8–222, 9–262.
బౌలింగ్: భువనేశ్వర్ 9–0–63–0, దీపక్ చహర్ 7–1–37–2, హార్దిక్ పాండ్యా 5–0–33–1, చహల్ 10–0–52–2, కుల్దీప్ యాదవ్ 9–1–48–2, కృనాల్ పాండ్యా 10–1–26–1.
భారత ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) అవిష్క ఫెర్నాండో (బి) ధనంజయ 43; ధావన్ (నాటౌట్) 86; ఇషాన్ కిషన్ (సి) భానుక (సి) సందకన్ 59; పాండే (సి) షనక (బి) ధనంజయ 26; సూర్యకుమార్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (36.4 ఓవర్లలో 3 వికెట్లకు) 263.
వికెట్ల పతనం: 1–58, 2–143, 3–215. బౌలింగ్: చమీర 7–0–42–0, ఉదాన 2–0–27–0, ధనంజయ 5–0–49–2, సందకన్ 8.4–0–53–1, అసలంక 3–0–26–0, హసరంగ 9–1–45–0, కరుణరత్నే 2–0–16–0.